
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ సాగిస్తున్న రష్యాపై యూరోపియన్ యూనియన్, యూకేలు మరింత కఠిన ఆంక్షలను ప్రకటించాయి. రష్యా ఇంధన రంగం, పాతబడిన ట్యాంకర్ నౌకలతో దొంగచాటుగా ముడిచమురు రవాణా, సైనిక నిఘా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. యుద్ధాన్ని ఆపేసే వరకు రష్యాపై ఇలాంటి ఒత్తిడులు కొనసాగుతూనే ఉంటాయని ఈయూ విదేశాంగ విధానం చీఫ్ కాయ కలాస్ చెప్పారు.
తాజా ఆంక్షలు అత్యంత కఠినమైనవన్నారు. ఇందులో భాగంగా ముడిచమురు ధరను మార్కెట్ ధర కంటే తక్కువగా 60 నుంచి 45 డాలర్ల వరకు తగ్గిస్తున్నట్లు ఈయూ తెలిపింది. 27 దేశాలతో కూడిన ఈయూ చమురు బారెల్ ధరను 48 డాలర్లుగా నిర్ణయించింది. అమెరికా సహా జీ7 గ్రూప్ దేశాలు సైతం ఈ విషయంలో తమతో కలిసి వస్తాయని ఈయూ ఆశిస్తోంది. అయితే, తాజా ఆంక్షలపై అమెరికా స్పందించకపోవడం గమనార్హం.
ఆయిల్ విక్రయాల ద్వారా పెద్దమొత్తంలో ఆర్జిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్‌తో యుద్ధానికి వాడుతున్నట్లు ఈయూ ఆగ్రహంతో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ఈయూయేతర దేశాలపైనా నిషేధం విధించింది. రష్యా, జర్మనీల మధ్య ఉన్న నార్డ్ స్ట్రీమ్ పైపులైన్ల ద్వారా రష్యా చమురు సరఫరా చేయకుండా నిషేధం విధించింది.
అంతేకాదు, రష్యాలోని బ్యాంకులు ఎలాంటి నిధులు సేకరించకుండా, ఆర్థిక కార్యక లాపాలను నిర్వహించకుండా ఆంక్షలు ప్రకటించింది ఈయూ. ఇందులో చైనాకు చెందిన రెండు బ్యాంకులున్నాయి. దీంతోపాటు, రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగం జీఆర్‌యూ లక్ష్యంగా యూకే మరిన్ని ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లోని ఓ థియేటర్‌లో 2022లో తలదాచుకున్న వారిపై బాంబు దాడికి కుట్ర పన్నడంతోపాటు, రష్యా ఏజెంట్ కుటుంబాన్ని నెర్వ్ ఏజెంట్‌తో చంపేందుకు యత్నించినందుకు జీఆర్‌యూకు చెందిన 18 మంది అధికారులపై ఆంక్షలు అమలవుతాయని తెలిపింది.
భారత్‌లోని రాస్‌నెఫ్ట్ రిఫైనరీపై ప్రభావం
ఈయూ విధించిన ఆంక్షల ప్రభావం భారత్ లోని రష్యా ఇంధన సంస్థ రాస్‌నెఫ్ట్ నడిపే రిఫైనరీపైనా పడనుంది. ఈ విషయాన్ని ఈయూ విదేశాంగ విధానం చీఫ్ కాయ కలాస్ తెలిపారు. బ్యారెల్ ధరను 60 డాలర్లకు తగ్గించడంతో రాస్‌నెఫ్ట్ సంస్థ భారత్‌లో క్రూడాయిల్‌ను ఈ ధరకే అమ్మాల్సి ఉంటుందన్నారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా నుంచి ఏకంగా 40 శాతం అందుతోంది. ఈయూ ఆంక్షలతో అంతిమంగా భారత్ లాభపడనుంది. గుజరాత్‌లోని వడినా ర్‌లో ఉన్న నయారా ఎనర్జీ లిమిటెడ్‌లో రాస్‌నెప్ట్‌కు 49.13% వాటా ఉంది. ఇక్కడి రిఫైనరీలో ఏడాదికి 20 మిలియన్ టన్నుల చమురు శుద్ధి అవుతుంది. తాజా ఆంక్షలతో నయారా కంపెనీ యూరప్ దేశాలకు పెట్రో ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.