దుబాయ్: మారుతున్న కాలానికి అనుగుణంగా దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) డ్రైవింగ్ శిక్షణలో కీలక మార్పులు చేపట్టింది. ఆధునిక వాహనాల్లో అందుబాటులోకి వచ్చిన 'అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్' (ADAS) వంటి అత్యాధునిక సాంకేతికతను లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సిలబస్‌లో చేర్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్రైవర్ల నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
శిక్షణలో కొత్త అంశాలివే..
నూతన సిలబస్ ప్రకారం అభ్యర్థులు వాహనాల్లోని కీలక భద్రతా వ్యవస్థలపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.
కొలిజన్ వార్నింగ్: వాహనం వేరే వస్తువును ఢీకొట్టే ప్రమాదం ఉన్నప్పుడు హెచ్చరించే వ్యవస్థ.
బ్లైండ్ స్పాట్ మానిటరింగ్: డ్రైవర్‌కు కనబడని ప్రదేశాల్లోని వాహనాల గుర్తింపు.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్: ముందటి వాహనం వేగానికి అనుగుణంగా స్వయంచాలక వేగ నియంత్రణ.
వీటితో పాటు ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, లేన్ చేంజ్ డిటెక్షన్, నైట్ విజన్ సిస్టమ్, ఏబీఎస్ (ABS) వంటి సాంకేతికతలపై థియరీ, ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు.
ప్రమాదాల నివారణే ధ్యేయం
"రహదారి భద్రతను మెరుగుపరచడం, డ్రైవర్ల ప్రవర్తనలో గుణాత్మక మార్పు తీసుకురావడం ద్వారా ప్రమాదాలను తగ్గించడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం" అని ఆర్టీఏ డ్రైవర్ లైసెన్సింగ్ డైరెక్టర్ సుల్తాన్ అల్ అక్రఫ్ తెలిపారు. డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ల సహకారంతో రూపొందించిన ఈ కొత్త సిలబస్ ఇప్పటికే హ్యాండ్‌బుక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
గత కొన్నేళ్లలో సవరించిన సిలబస్ ద్వారా సుమారు 2.50 లక్షల మందికి పైగా శిక్షణ పొందారని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్లకు ఈ సరికొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించేలా శిక్షకులకు ప్రత్యేక వర్క్‌షాపులు కూడా నిర్వహించినట్లు ఆర్టీఏ స్పష్టం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడమే దుబాయ్ లక్ష్యమని వారు పేర్కొన్నారు.


