బలహీనతపై ఇరాన్ దాడి.. ఎఫ్-35.. ఇక చౌక బేరం! | Doubts Over The Capabilities Of The American F 35 Fighter Jet | Sakshi
Sakshi News home page

బలహీనతపై ఇరాన్ దాడి.. ఎఫ్-35.. ఇక చౌక బేరం!

Mar 24 2026 3:03 PM | Updated on Mar 24 2026 3:44 PM

Doubts Over The Capabilities Of The American F 35 Fighter Jet

కొనుగోలు డీల్స్... ‘డీలా’ ఖాయం? 

రాడార్ కన్నుగప్పినా ఇంజిన్ ‘వేడి’తో పట్టుబడింది 

అమెరికా యుద్ధ విమానం సామర్థ్యంపై నీలినీడలు

ప్రపంచంలోనే అత్యాధునిక అమెరికా యుద్ధవిమానం ఎఫ్-35ను కూల్చివేసినట్టు ఇరాన్ ఈ నెల 19న ప్రకటించింది. ఈ వాదనే నిజమైతే ప్రపంచంలో ఆ ‘ఘనకార్యం’ చేసిన తొలి దేశం ఇరానే అవుతుంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఎఫ్-35 ఫైటర్ జెట్... అమెరికా మిలిటరీ పరాక్రమానికి రెండు దశాబ్దాల ప్రతీక. శత్రువులు కనుగొనలేని, ప్రపంచంలోని అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు కూడా గుర్తించలేని స్టెల్త్ సామర్థ్యంతో దూసుకెళుతూ దాడులు జరిపేలా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

రాడార్ సైతం గుర్తించలేని, శత్రువుల కంటబడని ఓ అమేయ ‘అదృశ్య శక్తి’గా విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఎఫ్-35 విమానానికి సంబంధించి కీలక బలహీనతను తాము కనిపెట్టినట్టు ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది. తాము సొంతంగా అభివృద్ధి చేసుకున్న ‘మాజిద్’  స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి ద్వారా అమెరికన్ ఎఫ్-35 యుద్ధవిమానాన్ని కూల్చినట్టు పేర్కొంది.

గమనంలో ఎఫ్-35 జెట్ వెలువరించే వేడి లేదా పరారుణ వికిరణం ఆధారంగా ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చేవేశామని తెలిపింది. రాడార్లకు దొరక్కుండా తప్పించుకునే సామర్థ్యం ఎఫ్-35కు ఉంటే ఉండొచ్చుగాక... ఇంజిన్ విడుదల చేసే వేడి పరంగా (హీట్ సిగ్నేచర్) మాత్రం అది పూర్తిగా శత్రువుల కళ్లుగప్పలేదని తేటతెల్లమైంది.

ఎఫ్-35ను దెబ్బకొట్టడానికి తమ ‘తలాష్’ గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించినట్టు తొలుత పేర్కొన్న ఇరాన్... వాస్తవానికి ‘మాజిద్’ (ఏడీ-08) స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో కేవలం ఒకేఒక క్షిపణితో ఆ కార్యం సాధించినట్టు తుది పరిశీలన అనంతరం ప్రకటించింది. శత్రు రాడార్ల సంకేతాలను నిలువరించేలా లేదా వాటిని చెల్లాచెదురు చేసేలా ఎఫ్-35లోని ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కానీ ఈ సందర్భంలో అవేవీ అక్కరకు రాలేదు. ‘మాజిద్’ స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్ 2021లో తొలిసారి ఆవిష్కరించింది. ఇది రాడార్ బదులు పరారుణ సాంకేతికతపై ఆధారపడుతుంది.

ఎఫ్-35లపై స్పెయిన్ వెనుకంజ!
ఎఫ్-35ను ఇరాన్ కూల్చివేసిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సైనిక,  రక్షణ రంగాల నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గగనతలంలో ఎఫ్-35కు ఎదురేలేదని ఇన్నాళ్లూ కొనసాగిన ఏకధాటి భావనను తాజాగా సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’కు ఎఫ్-35 సామర్థ్యం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిణామం పలు దేశాలను ఇప్పుడు పునరాలోచనలో పడవేయనుంది. అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ లాక్ హీద్ మార్టిన్ తయారుచేసిన ఐదో తరం ఎఫ్-35 స్టెల్త్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను స్పెయిన్ ప్రభుత్వం ఏడాది క్రితమే అటకెక్కించింది.

2030 నాటికి తమ హారియర్ ఏవీ8బీ ఫైటర్లను తప్పించి వాటి స్థానంలో నేవల్ వెర్షన్ అయిన ఎఫ్-35బి జెట్స్ మోహరించేందుకు స్పెయిన్ నౌకాదళం తొలుత ఆసక్తి చూపినా చివరకు వెనకడుగు వేసింది. ఎఫ్సీఏఎస్ (ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్) రూపొందించే ఆరో తరం యుద్ధవిమానాల కోసం నిరీక్షించాలని, అవి అందుబాటులోకి వచ్చేవరకు తమ మెక్ డానెల్ డగ్లస్ ఎఫ్/ఏ-18 హార్నెట్స్ స్థానంలో ఎఫ్-35ఏ యుద్ధవిమానాలను తాత్కాలికంగా ప్రవేశపెట్టాలని స్పెయిన్ వైమానికదళం కూడా భావించింది.

తమ నేవీ, ఎయిర్ ఫోర్స్ అవసరాల రీత్యా పాత విమానాలను డీకమిషన్ చేసి వాటి బదులు ఎఫ్-35లను ప్రవేశపెట్టడానికి స్పెయిన్ తన 2023 బడ్జెట్లో 6.25 బిలియన్ యూరోలను (సుమారు రూ.68 వేల కోట్లు) ప్రాథమికంగా కేటాయించింది. ప్రస్తుతం ఆ ప్రణాళికలు మూలనపడ్డాయి. ఎఫ్-35ల బదులు ఎయిర్ బస్ నేతృత్వంలోని సంస్థలు తయారుచేసే ‘యూరోఫైటర్’ జెట్స్ కొనాలని స్పెయిన్ తలపోస్తోంది.

ఫ్రెంచ్ రఫేల్ వైపే భారత్ మొగ్గు!
ఇరుదేశాల రక్షణ బంధం బలోపేతం దిశగా ఎఫ్-35 యుద్ధవిమానాలను ఇండియాకు అమ్ముతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఆఫర్ ఇచ్చారు. వేరియంట్ ఆధారంగా ఒక్కో ఎఫ్-35 ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. ఎఫ్-35లో ఎ, బి, సి అని మూడు రకాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్-35ఎ రకం జెట్ టేకాఫ్, ల్యాండింగ్ సాధారణ విమానాల మాదిరిగా ఉంటుంది. దీనికి పొడవైన రన్ వే కావాలి.

ఎఫ్-35బి వెర్షన్ అయితే అతికొద్ది రన్ వేతో పైకి లేచి నిట్టనిలువుగా కిందికి దిగగలదు. ఇక ఎఫ్-35సి అనేది... విమాన వాహక నౌకల (నేవీ క్యారియర్ బేస్డ్) కార్యకలాపాల్లో వాడే వేరియంట్. ఎఫ్-35లను కొనబోమని భారత్ గతంలోనే స్పష్టీకరించింది. తమ వైమానిక దళ అవసరాల కోసం రూ.3.6 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధవిమానాలను సేకరించే ప్రతిపాదనను భారత్ ఇటీవల ఆమోదించింది.

అదే బాటలో స్విట్జర్లాండ్, కెనడా!
అమెరికన్ ఎఫ్-35 జెట్స్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ స్విట్జర్లాండులోనూ నిరుడు  డిమాండ్లు ఊపందుకున్నాయి. 36 ఎఫ్-35ఎ విమానాలను కొనాలని స్విట్జర్లాండ్ మొదట్లో భావించింది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర కారణాల రీత్యా ధర పెరిగినందున అన్ని జెట్స్ కొనలేమని, ఆరు విమానాలను తగ్గించి 30 మాత్రమే ఎఫ్-35లను కొనుగోలు చేస్తామని స్విస్ ఫెడరల్ కౌన్సిల్ ఈ నెల 6న వెల్లడించింది.

ఇక కెనడా విషయానికొస్తే 16 ‘ఎఫ్-35ఏ లైట్నింగ్ 2’ విమానాల కోసం తొలుత ఆర్డర్ ఇచ్చింది. అవి త్వరలో అందుతాయి. అదనంగా మరో 14 ఎఫ్-35ల కొనుగోలుకు కూడా ఆ దేశం ప్రయత్నిస్తోంది. అయితే విమానాల ధర పెరగడం, అమెరికాతో రాజకీయ-వర్తక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని కెనడా ప్రభుత్వం మరిన్ని ఎఫ్-35లను కొనాలా? వద్దా? అని ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతోంది. ‘హీట్ సిగ్నేచర్’ బలహీనతను కనిపెట్టి ఇరాన్ కొట్టిన ఉండేలు దెబ్బకు భవిష్యత్తులో ఎఫ్-35లకు గిరాకీ తగ్గి కొనుగోలు మార్కెట్ డీలా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భలే మంచి చౌక బేరం తప్పదా?!
- జమ్ముల శ్రీకాంత్

(Credits: The Wall Street Journal, MSN, Reuters, Politico, The Hill)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement