నేడే చార్లెస్‌–3 పట్టాభిషేకం

Coronation of Charles III and Camilla - Sakshi

 అట్టహాసంగా ఏర్పాట్లు 

రాజు, రాణికి కిరీటధారణ చేయనున్న మత పెద్దలు

లండన్‌: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్‌–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్‌–3 బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్‌–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటాన్ని చార్లెస్‌–3, సెయింట్‌ మేరీస్‌ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు.

ఈసారి కోహినూర్‌ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్‌ ఎలిజబెత్‌–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్‌–3 పట్టాభి         షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్‌ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్‌ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్‌ బైబిల్‌ సూక్తులు చదివి వినిపిస్తారు.

చార్లెస్‌–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్‌ ఎంపైర్‌ మెడల్‌(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్‌ సైనికులతోపాటు కామన్వెల్త్‌ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top