విందులో వెయిటర్ ముసుగులో మిలటరీ ఆఫీసర్ చెంగ్ చెంగ్
రహస్యాలు రాబట్టడానికి కుట్ర
స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపణలు
బీజింగ్: తమ దేశానికి అధికారిక పర్యటనకు వచ్చిన విశిష్ట అతిథులపై డ్రాగన్ దేశం నిఘా పెట్టిందా? వారి కదలికలు తెలుసుకోవడానికి, రహస్యాలు రాబట్టడానికి సైనికాధికారులను మారువేషాల్లో రంగంలోకి దించిందా? గూఢచర్యం సాగించిందా?.. ఇదంతా నిజమేనని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ చెబుతున్నారు. విదేశీ ప్రముఖులపై గూఢచర్యం చేయడం చైనాకు కొత్తేమీ కాదని అంటున్నారు.
ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన బృందంతో కలిసి చైనాలో పర్యటించారు. ఆయన వెంట ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తోపాటు అమెరికా పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. ట్రంప్ గౌరవార్థం ఆయన బృందానికి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) విందు ఇచ్చింది.
ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ పక్కన ఎర్రరంగు దుస్తుల్లో ఉన్న ఓ మహిళ చాలాసేపు నిలబడి ఉండడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె వెయిటర్‌గా వ్యవహరించారు. నిజానికి సదరు మహిళ వెయిటర్ కాదని, చైనా మిలటరీ ఆఫీసర్ అని జెన్నిఫర్ జెంగ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఒక ఫొటోలో వెయిటర్ దుస్తుల్లో ఉన్న మహిళ మరో ఫొటోలో మిలటరీ యూనిఫామ్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ దుస్తుల కింద తుపాకీ!
విదేశాలపై చైనా ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని, అనేక కుట్రలకు పాల్పడుతోందని జెన్నిఫర్ జెంగ్ గతంలోనూ పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించారు. 2023లో కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అంతం చేసి పరారయ్యారు. అయితే, హత్య వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ హస్తం ఉన్నట్లు జెన్నిఫర్ జెంగ్ తేల్చిచెప్పారు. నిజ్జర్‌ను చంపేసి, ఈ నిందను భారత్‌పైకి నెట్టేశారని తెలిపారు.
తద్వారా భారత్‌కు, పచ్చిమ దేశాలకు మధ్య విభేదాలు సృష్టించడం, దూరం పెంచడమే చైనా అసలు కుతంత్రమని స్పష్టంచేశారు. తాజాగా ఎలాన్ మస్క్ పై నిఘా పెట్టిన సైనికాధికారి పేరు జనరల్ చెంగ్ చెంగ్ అని వెల్లడించారు. ఆమె బెటాలియన్ కమాండర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. చైనా ప్రభుత్వమే ఆమెను మారువేషంలో వెయిటర్‌గా నియమించిందని పేర్కొన్నారు. ‘‘చెంగ్ చెంగ్ తన ఎర్రటి దుస్తుల కింద తుపాకీ లేదా అలాంటి ఆయుధమేదో దాచి ఉంచిందని నేను భావిస్తున్నాను’’అని సోషల్ మీడియాలో పోస్టులో జెన్నిఫర్ జెంగ్ వివరించారు. అయితే, జెంగ్ ఆరోపణలపై చైనా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
పాశ్చాత్య దేశాలకు సంబంధించిన లక్ష్యాలపై, ప్రముఖులపై చైనా ప్రభుత్వం రహస్యంగా గూఢచారులను మోహరించిన చరిత్ర ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ టెక్నాలజీ రంగాల్లోకి, దౌత్య వర్గాల్లోకి చైనా ప్రభుత్వ ఏజెంట్లు మారుపేర్లు, మారువేషాల్లో చొరబడుతున్నారని, రహస్యాలు కాజేసే ప్రయత్నాలు సాగిస్తున్నారని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. పచ్చిమ దేశాలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చని చెబుతున్నాయి. చైనాను సులభంగా నమ్మకూడదని అంటున్నాయి.


