
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ
బీజింగ్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించాలంటూ జీ7 దేశాలకు అమెరికా ప్రభుత్వం పిలుపు ఇవ్వడాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఖండించారు. టారిఫ్‌లు, ఆంక్షలు సమస్యను మరింత సంక్లిష్టంగా మారుస్తాయే తప్ప ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ఎలాంటి యుద్ధాల్లో తాము పాల్గొనడం లేదన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా యుద్ధాలకు ముగింపు పలకాలన్నదే తమ విధానమని ఉద్ఘాటించారు.
టారిఫ్‌లను పెంచాలన్న ఆలోచన ఎవరకీ మేలు చేయదని అన్నారు. అమెరికా ట్రెజరీ సెక్రెటరీ బెస్సెంట్ జీ7 దేశాల ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడుతూ.. భారత్, చైనాలో టారిఫ్‌లు పెంచాలని సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగిసిపోవాలని నిజంగా కోరుకుంటే తాము చెప్పినట్లు చేయాలని పేర్కొన్నారు. దీనిపై వాంగ్ యీ స్పందించారు. చైనా బాధ్యతయుతమైన అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. శాంతి, భద్రత వంటి అంశాల్లో చైనాకు మంచి రికార్డు ఉందన్నారు.