
ప్రపంచంలోనే తొలిసారి కేంద్రక సంలీన, విచ్ఛిత్తి అణు రియాక్టర్
విజయవంతమైతే నిరంతర, అపార విద్యుచ్ఛక్తి అందుబాటులోకి
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం.
ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్ వాహనాలను చార్జ్ చేయడానికి సమానమైన విద్యుత్ కావాలని అంచనా. ఆన్‌లైన్ డేటాను రెప్పపాటులో ప్రాసెస్ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్ సరఫరా తప్పనిసరి.
ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్‌లైన్‌లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్ రంగంలో ఇప్పటికే నంబర్‌వన్‌గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి...
ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం.
హువాయీ, టెన్‌సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్ టెక్నాలజీలో బీవైడీ టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్ పనిలో పడింది.
ఇలా పని చేస్తుంది
జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్ ద్వీపంలో ఝింగ్‌హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్‌హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే.
అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్‌హువో రియాక్టర్‌లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.
అత్యధిక ‘క్యూ వాల్యూ’
అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్ విద్యుత్ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం పేర్కొంది.
మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్నాడ్ బేర్‌ట్రెండ్ అభిప్రాయపడ్డారు.
– సాక్షి, నేషనల్ డెస్క్