చాట్‌జీపీటీ సరికొత్త చరిత్ర!  నెలల వ్యవధిలోనే కోట్లాది యూజర్లు

ChatGPT Sets A New Record For Fastest Growing User Base - Sakshi

వాషింగ్టన్‌: నిత్యం సామాజిక మాధ్యమాల్లో మునిగితేలే జనం వారి అవసరాలకు తగ్గ యాప్, చాట్‌బోట్‌ వస్తే వాటికి ఎంతగా కనెక్టవుతారనేందుకు ఇది మరో ఉదాహరణ. కృత్రిమ మేథ చాట్‌బోట్‌ అయిన చాట్‌జీపీటీకి జనవరిలో రెండు, మూడు రోజులు రోజుకు 1.3 కోట్ల మంది చొప్పున కొత్త యూజర్లు జత చేరారు! ఇన్‌స్ట్రాగాం, టిక్‌టాక్‌ వంటివాటికి రెండేళ్లకు కూడా సాధ్యంకాని యూజర్ల సంఖ్యను రెండు నెలల్లోనే చాట్‌జీపీటీ సాధించి చూపించింది.

అసలు గత నవంబర్‌లో లాంచైన ఐదు రోజుల్లోనే 10 లక్షల మంది యూజర్లను సాధించింది. ఇది కూడా మరే సోషల్‌ మీడియా మాధ్యమానికీ, యాప్‌కూ సాధ్యం కాని ఘనతే. లాంచైన రెండు నెలలకే చాట్‌జీపీటీ ఖాతాలో ఇప్పుడు 10 కోట్ల మంది యూజర్లు ఉండటం విశేషం. 10 కోట్ల యూజర్లు కావడానికే టిక్‌టాక్‌కు తొమ్మిది నెలలు, ఇన్‌స్ట్రాగామ్‌కు 2.5 సంవత్సరాలు పట్టిందని సెన్సార్‌ టవర్‌ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 

ప్రేమలేఖలూ రాస్తుంది... 
చాట్‌జీపీటీ పనితీరు అంతా ఇంతా కాదు. మన ఆదేశాలకనుగుణంగా అదే ఇ–మెయిల్‌ రాసిపెడుతుంది. మన భావాలు తెలిపితే చక్కటి ప్రేమలేఖనూ సిద్ధం చేస్తుంది. దాంతో యువతతోపాటు పలు రంగాల వృత్తినిపుణులు కూడా దీనికి ఫిదా అయిపోయారు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో ఎంట్రీ లెవల్‌ (ఎల్‌3) స్థాయిలో కోడింగ్‌ కూడా రాసిపెడుతుందని గూగుల్‌ వర్గాలు ధ్రువీకరించినట్టు సీఎన్‌బీసీ ఇటీవల ఒక కథనంలో పేర్కొంది.

సెర్చ్‌ ఇంజన్‌ రంగంలో తన ఆధిపత్యానికి చాట్‌జీపీటీ ఎసరు తెస్తుందని ఊహించిన గూగుల్‌ వెంటనే తన సొంత కృత్రిమ మేథ చాట్‌బోట్‌ లాఎండీఏను సిద్ధంచేస్తోంది. మేలో దాన్ని ఆవిష్కరించే అవకాశముంది. దీనితోపాటే మరో 21 కృత్రిమ మేథ ఉత్పత్తుల అభివృద్ధిపైనా గూగుల్‌ దృష్టిపెట్టింది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top