
కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టైలర్ రాబిన్‌సన్(22).. ఎందుకు చంపాడన్నదానిపై దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే కిర్క్ భావజాలమే ఆయన హత్యకు కారణమైందన్న చర్చ ఇప్పుడు అక్కడ నడుస్తోంది.
చార్లీ కిర్క్ హత్య కేసులో నిందితుడు టైలర్ రాబిన్సన్(Tyler Rabinson)ను తాజాగా కోర్టులో ప్రవేశపెట్టారు. మాసిన గడ్డంతో.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో అతను విచారణకు హాజరయ్యాడు. నేర తీవ్రత దృష్ట్యా అతనికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తన భాగస్వామికి చేసిన సందేశాలను నేరాంగీకరంగా పరిగణించాలని కోరుతున్నారు.
కోర్టు పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం.. టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ వ్యవస్థాపకుడైన కిర్క్ సెప్టెంబర్ 10వ తేదీన ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన అమెరికన్ కమ్‌బ్యాక్ కార్యక్రమంలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్న క్రమంలో.. ఓ తూటా దూసుకొచ్చి ఆయన గొంతులో దిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి.. కాల్పుల తర్వాత గనతో ఓ వ్యక్తి ఓ భవనం మీద నుంచి దూకి పారిపోతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఏజెన్సీలు ఆ మరుసటి రోజే 22 ఏళ్ల రాబిన్‌సన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఆ సమయంలో తన రూమ్‌మేట్.. ట్రాన్స్‌జెండర్ భాగస్వామితో అతను జరిపిన చాటింగ్‌లో హత్యకు కారణాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అతనిపై(చార్లీ కిర్క్) ద్వేషాన్ని ఇంక భరించలేకపోతున్నా. కొన్ని ద్వేషాలు ఏరకంగానూ తొలగిపోలేవు అని ఓ సందేశాన్ని తన భాగస్వామికి పంపాడతను. అంతేకాదు.. ఘటనకు సరిగ్గా వారం కిందటి నుంచి ప్రణాళిక వేసుకున్నాడని, కిర్కీని ఎందుకు చంపాలనుకునే విషయాలను గతన గదిలో ఓ పేపర్‌పై రాసుకున్నాడు. అంతేకాదు.. గదిలోని కంప్యూటర్ కీ బోర్డు కింద‘‘ అవకాశం దొరికితే చార్లీ కిర్క్‌ను అంతమొందిస్తా’’ అంటూ రాసిన ఓ నోట్ కూడా దొరికింది. అయితే ఆ నోట్‌ను అతని భాగస్వామి తొలుత ప్రాంక్‌గా భావించిందట.
కానీ కాల్పుల ఘటన తర్వాత తన పార్ట్‌నర్‌కు మెసేజ్ పంపి.. అది జోక్ కాదనే విషయాన్ని రాబిన్‌సన్ ధృవీకరించాడు. ‘‘ఈ విషయాన్ని ఎప్పటికీ నీకు చెప్పకూడదనుకన్నా. నేను ఇప్పటివరకైతే బాగానే ఉన్నా. హత్య జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయా. దాచిన నా రైఫిల్‌ను తీసుకోవాలసి ఉంది. త్వరలో ఇంటికి వస్తానేమో. ఇందులోకి నిన్ను ఇందులో లాగినందుకు నన్ను క్షమించు. నీ కోసమే నా బాధంతా’’ అంటూ మెసేజ్‌లు పెట్టాడు. ఒకవేళ తాను దొరికిపోతే.. అధికారులు నీ దాకా వస్తారని, ఆ సమయంలో నోరు మెదపొద్దని ఆ భాగస్వామికి సూచించాడు. ఆ తర్వాత ఆ మెసేజ్‌లను డిలీట్ చేశాడు.
ఇక.. ఘటన తర్వాత దొరికిన క్లూస్ ఆధారంగా పోలీసులు సెయింట్ జార్జ్‌లోని రాబిన్‌సన్ నివాసంలో సోదాలు జరిపారు(ఈ ప్రాంతం కిర్క్ హత్య జరిగిన ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది). ఆ తనిఖీల్లో దొరికిన ఆధారాలతో చార్లీ కిర్క్‌కు చంపింది అతనేనని నిర్ధారించుకున్నారు. అరెస్ట్ చేసి వాషింగ్టన్ కౌంటీ జైలుకు తరలించారు. హత్యకు ఉపయోగించిన రైఫిల్‌ను ఘటనా స్థలంలోని పొదల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో విచారణకు అతను సహకరించకపోయినా.. అతని కుటుంబ, స్నేహితులు కీలక విషయాలనే వెల్లడించారు.
తన కొడుకు కొంతకాలంగా ఓ ట్రాన్స్‌జెండర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, అప్పటి నుంచి అతని ఆలోచన ధోరణి మారిందని, రాజకీయంగానూ వామపక్ష భావజాలం వైపు అడుగులేశాడని రాబినసన్ తల్లి అంటోంది. ప్రస్తుతానికి రాబిన్‌సన్‌పై ఏడు కేసులు నమోదు అయ్యాయి. దోషిగా తేలితే మరణశిక్ష పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
మరోవైపు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ కేసు దర్యాప్తుపై స్పందించారు. డిస్‌కార్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో రాబిన్‌సన్‌తో కొందరు చాటింగులు చేశారని, వాళ్ల వివరాలు సేకరించి విచారణ జరపుతామని ప్రకటించారాయన. కన్జర్వేటివ్ భావజాలం, దీనికి తోడు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీపై చార్లీ కిర్క్ వెల్లగక్కిన ద్వేషమే.. అతని పాలిట శాపమైంది. ఈ ధోరణిని భరించలేకనే టేలర్ రాబిన్సన్ ఇంతటి ఘాతుకానికి తెగబడ్డాడనే విషయం కోర్టు డాక్యుమెంట్ల ద్వారా ఇప్పుడు బయటకొచ్చింది.