డబ్లిన్: ఐర్లాండ్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో కేథరీన్ కొన్నోలీ ఘనవిజయం సాధించారు. శనివారం జరిగిన ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కేథరీన్ కొన్నోలీ ఘన విజయం సాధించారు. ఆమె 63.4శాతం ఓట్లతో గెలుపొందగా.. ప్రత్యర్థి హీదర్ హంప్రీస్ 29.5శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు.
ఐర్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన కేథరీన్ కొన్నోలీకి గాల్వే ఎంపీగా సేవలందించిన అనుభవం ఉంది. అలాగే బారిస్టర్గా, క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం.. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరిగిన మీడియా సమావేశంలో యూరోపియన్ యూనియన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విలువలు, శాంతి కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.
‘నేను వినే అధ్యక్షురాలిని, ఆలోచించే అధ్యక్షురాలిని, అవసరమైనప్పుడు మాట్లాడే అధ్యక్షురాలిని అవుతాను. మనం కలిసి అందరికీ విలువ ఇచ్చే కొత్త గణతంత్రాన్ని నిర్మించగలము’ అని ప్రకటించారు.


