కృత్రిమ మేధ కళలకు వధ?

Another threat is questioning the survival of artists with artificial intelligence - Sakshi

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు క్లౌడిమోనెట్‌ ‘వాటర్‌ లిల్లీస్‌’ పేరిట రూపొందించిన 250 చిత్రాలు పూర్తి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. తన ఇంటి దగ్గర ఉన్న సరస్సులో లిల్లీపూల స్ఫూర్తిగా ఆయన వీటిని చిత్రించారు. వాటర్‌ లిల్లీస్‌లోని ఒక చిత్రం 2007లో సోత్‌బే వేలంలో 1.85 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. తరువాతి సంవత్సరం లండన్‌ క్రిస్టీ వేలంలో మరో చిత్రం 4.1 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. మోనెట్‌ చిత్రించిన వాటర్‌ లిల్లీస్‌ను ఓ మంచి ఫొటోగ్రాఫర్‌ అంతే అందంగా కొన్ని క్షణాల్లో కెమెరాలో బంధించగలడు కానీ వాటికి ఉండే విలువెంత?  

దొడ్డ శ్రీనివాసరెడ్డి : 19వ శతాబ్దంలో లాండ్‌ స్కేప్‌ ఆర్టిస్టులకు, ఫొటోగ్రాఫర్లకు మధ్య వివాదం చెలరేగింది. ఫొటోలను సృజనాత్మక కళగా గుర్తించగలమా అన్నది నాటి కళాకారుల ప్రశ్న. కానీ తదుపరి కాలంలో ఫొటోగ్రఫీ కూడా కళగా అవతరించింది. ఫొటోలు కూడా వందల కోట్ల డాలర్లు ఆర్జించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కళాకారుల మనుగడనే ప్రశ్నించే మరో ముప్పు కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో వచ్చి పడింది.

ఏళ్లకు ఏళ్లు చేసిన సాధన ద్వారా కళాకారులు సాధించిన నైపుణ్యాన్ని కృత్రిమమేధ క్షణాల్లో అనుకరిస్తోంది. నమూనాలను సృష్టిస్తోంది. కృత్రిమమేధ ఇకముందు కళలకు సమాధి కడుతుందా? మనిషి సృజనాత్మకతతో పోటీపడుతుందా? కారుచౌకగా ఏఐ కళారూపాలను సృష్టిస్తుంటే అసలు కళలకు ఆదరణ ఉంటుందా? ఏఐ రూపొందించే కళలకు విలువ ఉంటుందా? అన్నవి ఇప్పుడు కళా ప్రపంచంలో తలెత్తుతున్న ప్రశ్నలు. ఇప్పటికే అనేక రంగాలను ఆక్రమించుకుంటున్న కృత్రిమమేధ ఇక సృజనాత్మక కళారంగాలనూ కబ్జా చేస్తుందని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. 

కృత్రిమమేధ ఆధారంగా చాట్‌బాట్‌ ‘చాట్‌ జీపీటీ’ సృష్టించిన సంస్థ ఓపెన్‌ ఏఐ రూపొందించిన మరో ప్లాట్‌ఫామ్‌ డాల్‌–ఇ. ప్రఖ్యాత ఫ్రెంచ్‌ సర్రియలిస్ట్‌ పెయింటర్‌ సాల్వడార్‌ డాలీ పేరును పోలినట్లుగా ఉండే ఈ డాల్‌–ఇ ప్లాట్‌ఫామ్‌ కృత్రిమమేధను ఉపయోగించి అద్భుతమైన డిజిటల్‌ పెయింటింగ్స్‌ను సృష్టిస్తోంది. డాల్‌–ఇ మాదిరిగానే మిడ్‌ జర్నీ, స్టేబుల్‌ డిఫ్యూజన్‌ లాంటి మరికొన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు కూడా చిత్ర కళారంగంలో చొరబడి సంచలనం సృష్టిస్తున్నాయి.

హేగ్‌ మ్యూజియంలో ఉన్న జొనెస్‌ వెర్మర్‌ అద్భుత కళాఖండం ‘గర్ల్‌ విత్‌ ఎ పెరల్‌ ఇయరింగ్‌’ స్ఫూర్తిగా జులియన్‌ వాన్‌ డైకెన్‌ అనే ఆర్టిస్టు మిడ్‌ జర్మీ ప్లాట్‌ఫామ్‌పై కృత్రిమమేధను వినియోగించి రూపొందించిన ‘ఎ గర్ల్‌ విత్‌ గ్లోయింగ్‌ ఇయరింగ్స్‌’ చిత్రాన్ని ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఓ ప్రముఖ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టినప్పుడు చిత్ర కళారంగంలో అలజడి రేగింది. కంప్యూటర్‌ సృష్టించిన చిత్రాన్ని కళాఖండంగా ఎలా పరిగణిస్తారని ఆర్టిస్టులు ముక్తకంఠంతో ప్రశ్నించారు.

ప్రింటింగ్, పబ్లిషింగ్‌ పరిశ్రమ కూడా ఇప్పుడు కృత్రిమమేధను ఆశ్రయించి కవర్‌ డిజైన్స్‌ రూపొందిస్తోంది. ప్రముఖ పత్రిక ‘ది ఎకనామిస్ట్‌’ ఇప్పుడు తన కవర్‌ డిజైన్ల సృష్టికి కృత్రిమమేధపై ఆధారపడుతోంది. అనేకమంది రచయితలు తమ నవలలు, పుస్తకాల కవర్‌ డిజైన్ల కోసం కృత్రిమమేధను ఉపయోగిస్తున్నారు. ఆర్కిటెక్ట్‌లు కూడా అద్భుతమైన కట్టడాలు, డామ్‌లు, స్టేడియాలు, గార్డెన్ల డిజైన్ల రూపకల్పనకు కృత్రిమమేధను ఆశ్రయిస్తున్నారు.

ఫ్యాషన్‌ ప్రపంచంలోకీ కృత్రిమమేధ అడుగుపెట్టింది. ది ఫ్యాబ్రికెంట్‌ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు అనూహ్యమైన వ్రస్తాలు, ఆభరణాల డిజైన్‌లను ఏఐతో సృష్టిస్తున్నాయి. ఇవి ధరించడానికి పనికి రావు కానీ డిజిటల్‌ రూపంలో వర్చువల్‌గా వీటిని ధరించి ఆనందించవచ్చు. అయితే వీటిని పొందడానికి మాత్రం ‘నిజమైన’ ధర చెల్లించాల్సిందే. కొన్ని వ్రస్తాల డిజైన్‌లు పదివేల డాలర్ల వరకు ఉన్నాయి.

ఇటీవల బీచ్‌లో సర్ఫింగ్‌ చేస్తున్న  వారి ఫొటో ఒకటి ఆ్రస్టేలియాలో ప్రతిష్టాత్మకమైన ఫొటోగ్రఫీ పోటీల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫొటో కృత్రిమమేధ ఆధారంగా తయారుచేసిందని తెలిసి ప్యానెల్‌ జడ్జిలు ఈ చిత్రాన్ని తొలగించి వేరే ఫొటోను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చెలరేగిన వివాదం ఫలితంగా పోటీలను రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి కంప్యూటర్‌ సృష్టించే ఫొటోలకు, మరొకటి కెమెరా ద్వారా తీసిన ఫొటోలకి.  

కదం తొక్కుతున్న కళాకారులు 
వివిధ రంగాలకు చెందిన కళాకారులు, నిపుణులు ఏళ్ల తరబడి కృషితో సాధించిన నైపుణ్యాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తున్న కృత్రిమమేధపై కదం తొక్కుతున్నారు. కళా నైపుణ్యాన్ని కూడా ఆటోమేషన్‌ చేస్తే తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టిస్టులు, డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, రచయితలు, మ్యుజీషియన్లు తమ మనుగడను అంధకారంలోకి నెడుతోందని కృత్రిమమేధపై విరుచుకుపడుతున్నారు. కృత్రిమమేధ చొరబాటును అడ్డుకునేందుకు రకరకాల ఆయుధాలు సన్నద్ధం చేస్తున్నారు.

శాన్‌ఫ్రాన్సికోకి చెందిన కార్టూనిస్టు సరా అండర్సన్, ఇల్ల్రస్టేటర్‌ కార్లో వోర్టిజ్‌ కాపీరైట్‌ చట్టం కింద న్యాయ పోరాటం చేస్తున్నారు. తమ బొమ్మలను అనుకరిస్తూ నకలు సృష్టిస్తున్న ఏఐ వేదికలు డ్రీమ్‌ అప్, మిడ్‌ జర్నీ, స్టేబుల్‌ ప్యూజన్‌పై వీరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, పరిహారం చెల్లించకుండా తమ బొమ్మలను వాడుకుంటున్నందుకు కాపీరైట్‌ చట్టం కింద శిక్షించాలని కోరారు.   

గుర్తింపు కావాలి 
ఏఐ ఆధారిత కంప్యూటర్‌ ప్రోగ్రాంలు సొం­తంగా ఏమీ సృష్టించలేవు. అవి సృష్టించే నకలుకి ఏదో ఒక అసలైన చిత్రమో, కళాకారులు లేదా రచయితల శైలి ఆధారం కావాలి. ఎలాంటి చిత్రం, ఫొటో, రచన కావాలన్నా ఎవరిశైలిలో కావాలన్నా కమాండ్‌ ఇస్తే వాటిని అనుసరించి కృత్రిమమేధ నకలును సృష్టించగలుగుతుంది. అలాంటప్పుడు వాటికి ఆధారమైన కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లకు తగిన రీతిలో పరిహారం చెల్లించడం, గుర్తింపు ఇవ్వాలనేది వారి వాదన.

క్రిస్‌ కస్టనోవా అనే రచయిత్రి ‘జోర్యా ఆఫ్‌ ద డాన్‌’ పేరిట ప్రచురించిన కామిక్‌ నవలకు అమెరికా కాపీరైట్‌ ఆఫీసు తొలుత ఆమోదం తెలిపింది. అయితే ఈ కామిక్‌లో ఉపయోగించిన బొమ్మలు మిడ్‌జర్నీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సృష్టించినట్లు తరువాత వెల్లడైంది. దీనిపై వివాదం చెలరేగడంతో నవలలో కథకు మాత్రమే కాపీరైట్‌ ఇస్తున్నామని, కంప్యూటర్‌ సృష్టించిన బొమ్మలకు ఇవ్వలేదని కాపీరైట్‌ ఆఫీసు తన నిర్ణయాన్ని సవరించుకుంది.

బొమ్మలు, కార్టూన్లు, చిత్రాలను కృత్రిమమేధ కాపీ కొట్టకుండా షికాగో యూనివర్సిటీకి చెందిన ఓ బృందం ‘గ్లేజ్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఉపయోగిస్తే, అది చిత్రాలపై కంటికి కనిపించని ఒక తెరను కప్పేస్తుంది. దాంతో కృత్రిమమేధ ఈ చిత్రాన్ని కాపీ కొట్టడం కుదరదు. ‘కృత్రిమమేధ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కొన్ని మార్గదర్శకాలు, ఆంక్షలు అవసరం’ అని గ్లేజ్‌ సృష్టికర్త స్వాన్‌షాన్‌ అభిప్రాయపడ్డారు. 

సహజీవనం తప్పదు 
కృత్రిమమేధ విస్తృతిని ఆపడం ఎవరివల్లాకాదు. అన్ని రంగాల్లోకి అది చొచ్చుకుపోతోంది. ఇక కృత్రిమమేధను మన జీవితాల్లోకి ఆహ్వా నించక తప్పదు. దాంతో సహజీవనానికీ మార్గం సుగమం చేసుకోవాల్సిందే అని విజ్ఞులు చెబుతున్నారు. సాల్వడార్‌ డాలీ సర్రియలిస్టు పెయింటింగ్స్‌ను, పికాసో అబ్‌ స్ట్రాక్ట్‌ పెయింటింగ్స్‌ను, బ్రాక్‌ క్యూబిజమ్‌ను మొదట్లో కళగా గుర్తించలేదు. కానీ ఇప్పుడవి అద్భుత కళాఖండాలుగా ఆవిష్కృతమయ్యాయి. కొత్తదనాన్ని స్వీకరించడానికి మనిషికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు కృత్రిమమేధ సృష్టించే కళారూపాల్ని ముందు ముందు మనం ఆమోదించి ఆహ్వా నిస్తామేమో?. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top