
మనామా: దాయాది దేశం పాకిస్తాన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఓ విఫల దేశమని ఘాటు విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా ప్రపంచమే ముప్పును ఎదుర్కొంటోందన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం.. ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో వచ్చిన ఏడుగురు సభ్యుల అఖిల బృందం శనివారం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ బృందంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా బహ్రెయిన్‌లో ఎంపీ అసద్ మాట్లాడుతూ.. ‘చాలా సంవత్సరాలుగా భారత్ ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేసేలా మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ కారణంగా మేము చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం, స్పాన్సర్ చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలను పాకిస్తాన్ ఆపకపోతే ఉగ్రవాద సమస్య తొలగిపోదు.
ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ మరింత దూకుడుగా వ్యవహరించేందుకు, మర్నిని దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈసారి ప్రతిదాడి మామూలుగా ఉండదు. పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెబుతాం. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ భారత్ సంయమనం పాటించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది విషయమై అందరూ ఆలోచించండి. ఆరు రోజుల క్రితం వివాహం చేసుకున్న ఒక మహిళ ఏడో రోజున వితంతువు అయ్యింది. కేవలం రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది. ఇలాంటి దారుణాలు పాకిస్తాన్ వల్లే జరుగుతున్నాయి.
మేమంగా వేరువేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ దేశం విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాం. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. దేశ సమగ్రత విషయానికి వస్తే అందరం ఒక్కటయ్యాం. పాకిస్తాన్‌ను FATF గ్రే లిస్ట్‌లోకి తీసుకురావడంలో బహ్రెయిన్ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటూ చెప్పుకొచ్చారు.
#WATCH | Manama, Bahrain: During an interaction with the prominent personalities, AIMIM MP Asaduddin Owaisi says, "...Our govt has sent us over here...so that the world knows the threat India has been facing since last so many years. Unfortunately, we have lost so many innocent… pic.twitter.com/ckukFxpGAc
— ANI (@ANI) May 24, 2025
ఇదిలా ఉండగా.. రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నేత నిశికాంత్ దూబేలు ఒక అంశంలో కలిసి పనిచేయాల్సి రావడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది. భిన్న ధ్రువాలుగా ఉండే ఈ ఎంపీలు పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్మాదాన్ని ఎండగట్టేందుకు పాక్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.