రోబో లాయర్‌! | Sakshi
Sakshi News home page

రోబో లాయర్‌!

Published Sun, Jan 8 2023 5:46 AM

AI-Powered Lawyer to Appear in US Court in February - Sakshi

వాషింగ్టన్‌: న్యాయవాదుల సేవలు నానాటికీ ఖరీదైన వ్యవహారంగా మారుతున్నాయి. ఈ భారీ ఫీజులతో పని లేకుండా ఓ రోబో లాయర్‌ మన తరఫున ఎంచక్కా కోర్టులో వాదిస్తే? బాగుంటుంది కదా! కృత్రిమ మేధతో పని చేసే అలాంటి రోబో లాయర్‌ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో అందుబాటులోకి రానుంది. డునాట్‌పే అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరించనుంది. కోర్టులో వాదనలు జరిగినంతసేపూ సలహాలు సూచనలు అందించనుంది.

స్మార్ట్‌ ఫోన్‌ సాయంతో వాదనలు వింటూ, ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో తన కక్షిదారుకు ఎప్పటికప్పుడు ఇయర్‌ ఫోన్లో చెబుతుందట. అయితే కక్షిదారు పేరు, వాదనలు జరిగే కోర్టు తదితర వివరాలను సదరు కంపెనీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతోంది. స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన కంప్యూటర్‌ సైంటిస్ట్‌ జోషువా బ్రౌడర్‌ దీని వ్యవస్థాపకుడు. తన యాప్‌ ఆధారిత రోబో లాయర్లు మున్ముందు లాయర్ల వ్యవస్థ మొత్తాన్నీ భర్తీ చేయాలన్నది ఆయన ఆకాంక్ష! అదెంత మేరకు నెరవేరుతుందో చూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement