ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల సూత్రధారి సిన్వార్.. అసలు కథేంటి..? | After 24 Years In Israel Jail Yahya Sinwar Lead Hamas Attacks | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల సూత్రధారి సిన్వార్.. అసలు కథేంటి..?

Oct 16 2023 1:40 PM | Updated on Oct 16 2023 4:54 PM

After 24 Years In Israel Jail Yahya Sinwar Lead Hamas Attacks - Sakshi

ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన తర్వాత యాహ్యా సిన్వార్ పేరు హల్ చల్ చేస్తోంది. సిన్వార్‌ను 1,300 మంది ఇజ్రాయెలీలను చంపిన క్రూరునిగా ఇజ్రాయెల్ అధికారులు పేర్కొంటున్నారు. హమాస్ దాడులకు సూత్రధారిగా సిన్వార్ అని ఆరోపిస్తున్నారు. గాజాలో భూతల దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఈ దాడుల్లో యాహ్యా సిన్వార్, అతని గ్రూప్ తమ లక్ష‍్యంలో ఉన్నారని ఇజ్రాయెల్ బలగాల ప్రతినిధి చెప్పారు. అయితే.. అసలు సిన్వార్ ఎవరు? ఈయన నేపథ్యం ఏంటి?

బాల్యం..
1962లో జన్మించిన సిన్వార్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో పెరిగి పద్దయ్యాడు. అప్పట్లో ఖాన్ యూనిస్‌ నగరం ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది. సిన్వార్ కుటుంబం మొదట్లో అష్కెలోన్‌లో స్థిరపడింది. కానీ 1948లో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన తర్వాత గాజాకు తరలి వెళ్లారు. సిన్వార్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు.

24 ఏళ్ల పాటు జైలు జీవితం
సిన్వార్ మొత్తం 24 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. 1982లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినందుకు తొలిసారిగా అరెస్టయ్యాడు.  పాలస్తీనా ఉద్యమంలో ఇజ్రాయెల్ గూఢచారులపై దాడులు చేయడానికి సలా షెహడేతో జతకట్టి ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్ బలగాల చేతుల్లో షెహడే మరణించిన తర్వాత  2002లో హమాస్ మిలటరీ విభాగానికి సిన్వార్ సారథ్యం వహించాడు. 

2006లో హమాస్ సైనిక విభాగం ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించడానికి సొరంగాన్ని ఉపయోగించింది. ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసి ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను చంపారు. అనేకమందిని గాయపర్చారు. గిలాడ్ షాలిత్ అనే ఒక సైనికుడిని పట్టుకున్నారు. శాలిత్ ఐదేళ్లపాటు బందీగా ఉన్నాడు. ఖైదీల మార్పిడి ఒప్పందంలో 2011లో విడుదలయ్యాడు. షాలిత్ విడుదల కోసం ఇజ్రాయెల్ 1,027 మంది పాలస్తీనియన్, ఇజ్రాయెలీ అరబ్ ఖైదీలను విడుదల చేసింది. వారిలో సిన్వార్ ఒకరు. 

విడుదలైన కొన్ని సంవత్సరాలలో సిన్వార్ హమాస్‌లో ముఖ్య నేతగా ఎదిగారు. 2015లో సిన్వార్‌ను అమెరికా వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేంతటి స్థాయికి చేరాడు.  2017లో గాజాలో హమాస్ అధిపతిగా సిన్వార్ ఎన్నికయ్యాడు.

ప్రధాన నేతగా..
హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియే తర్వాత సిన్వార్ 2వ స్థానంలో ఉన్నారు. హనియే స్వచ్ఛంద ప్రవాసంలో నివసిస్తున్నందున, గాజా వాస్తవ పాలన సిన్వార్ చేతుల మీదే నడిచేది.  ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దళాలను సమర్ధవంతంగా సమీకరించాడు. ఆవేశపూరిత ప్రసంగాలతో పేరుపొందిన సిన్వార్.. హమాస్‌కు సంపూర్ణ విధేయత చూపేవాడు. హమాస్ కార్యకర్తల నిఘా విషయంలో ఏమాత్రం రాజీకి వచ్చేవాడు కాదని అంటుంటారు. 

ప్రస్తుతం ఇజ్రాయెల్ నగరాలపై దాడులకు సిన్వార్ ప్రధాన సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ శనివారం జర్నలిస్టులతో మాట్లాడుతూ.. సిన్వార్ తమ లక్ష‍్యంలో ఉన్నాడని తెలిపారు.

ఇదీ చదవండి అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్‌​‍

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement