
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతు పలుకుతూ, ఆ దేశానికి 50 శాతం భారీ సుంకాన్ని ప్రకటించారు. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై విమర్శలు గుప్పించారు. ఇది అంతర్జాతీయ అవమానంగా అభివర్ణించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు ట్రంప్ రాసిన లేఖలో ఈ కేసును కొనసాగించవద్దని కోరారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై వాషింగ్టన్ దర్యాప్తు ప్రారంభిస్తుందని హెచ్చరించారు. భారత్ మాదిరిగానే బ్రెజిల్ ‘బ్రిక్స్’ భాగస్వామ్య దేశం.
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తనకు బాగా తెలుసని, ఆయనతో కలిసి తాను పనిచేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన పదవీకాలంలో ప్రపంచ నేతలు ఆయనను ఎంతో గౌరవంగా చూశారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అతని విషయంలో ప్రస్తుతం బ్రెజిల్ అనుసరిస్తున్న విధానం అవమానకరమని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. బోల్సోనారో తిరుగుబాటు కేసుపై ట్రంప్ గతంలో చేసిన విమర్శలపై బ్రెజిల్ ఇటీవల ఘాటుగా స్పందించిన దరిమిలా ట్రంప్ భారీ సుంకాలతో బ్రెజిల్‌కు షాకిచ్చారు.
బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లూలా నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బోల్సోనారో కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. అయితే సైన్యం నుంచి ఆయనకు మద్దతు అందకపోవడంతో ఆ కుట్ర విఫలమైందని చెబుతారు. అయితే బోల్సోనారో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కాగా ఆగస్టు ఒకటి నుంచి బ్రెజిలియన్ వస్తువులపై 50 శాతం అమెరికా సుంకం అమల్లోకి వస్తుందని, ఇతర ఆర్థిక వ్యవస్థల గడువుకు ఇది సమానమని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రస్తుతం తమ దేశ వాణిజ్య భాగస్వాములకు లేఖలు జారీ చేస్తున్నారు. అధిక సుంకాల జాబితాలో గతంలో బ్రెజిల్ లేదు.