Omicron Cases In US: 73% New Omicron Cases Registered In United States - Sakshi
Sakshi News home page

Omicron Variant: అమెరికాను కమ్మేసిన ఒమిక్రాన్‌.. 73 శాతం అవే కేసులు

Published Wed, Dec 22 2021 8:38 AM

73 Percentage Of New Covid Cases In US Are Omicron, Strain Now Dominant - Sakshi

Omicron Cases In US: అమెరికా ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వణికిపోతోంది. మిగతా వేరియంట్లతో పోలిస్తే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కారణంగానే భారీ సంఖ్యలో పౌరులు కోవిడ్‌ బారిన పడుతున్నారు. గత వారం నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్‌ కేసులే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్‌ విస్తృతి ఒక్కసారిగా ఎక్కువైంది. గత వారంలో ఇన్ఫెక్షన్లలో ఈ వేరియంట్‌ వాటా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగింది.

న్యూయార్క్‌ ప్రాంతంలో కొత్త కేసుల్లో 90శాతానికిపైగా కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వే. గత వారం మొత్తంగా 6,50,000 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ చివరివరకూ నమోదైన కేసుల్లో 99.5 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని వ్యాధి కట్టడి, నివారణ కేంద్రాల(సీడీసీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాషెల్‌ వాలెన్‌స్కీ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా ఆక్రమించి అమెరికా ఆరోగ్య వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించింది.
చదవండి: యూఎస్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం.. భయాందోళనలో ప్రజలు

అమెరికాలో తొలి ‘ఒమిక్రాన్‌’ మరణం
టెక్సాస్‌ రాష్ట్రంలో గతంలో కోవిడ్‌ నుంచి కోలుకున్న ఒక మధ్య వయస్కుడికి ఒమిక్రాన్‌ సోకి పరిస్థితి విషమించి మరణించారని అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. అతడు కోవిడ్‌ టీకాలు తీసుకోలేదని హ్యారిస్‌ కౌంటీ ప్రజారోగ్య విభాగం పేర్కొంది.

బైడెన్‌ సిబ్బందిలో ఒకరికి కరోనా
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. బైడెన్‌ తన ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’ ప్రత్యేక విమానంలో శుక్రవారం దక్షిణ కరోలినాలోని ఆరెంజ్‌ ప్రాంతం నుంచి ఫిలడెల్ఫియాకు పయనించారు. ఆ సమయంలో విమానంలో సిబ్బందిలో ఒకరు 30 నిమిషాలపాటు బైడెన్‌తోపాటు ఉన్నారు. ఆ వ్యక్తికే కరోనా సోకింది. దీంతో బైడెన్‌కు కరోనా సోకుతుందనే అనుమానాలు పెరిగాయి. బైడెన్‌కు రెగ్యులర్‌గా కరోనా టెస్ట్‌లు చేస్తారు. బుధవారం మరోసారి టెస్ట్‌ చేయనున్నారు. కరోనా వ్యాప్తిని మరింత వేగంగా గుర్తించి కట్టడికి చేసేందుకు బైడెన్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. ప్రజలు ఇంట్లోనే ర్యాపిడ్‌ టెస్ట్‌ చేసుకునేందుకు వారికి 50 కోట్ల కిట్లను ఉచితంగా అందివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement
Advertisement