న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చిక్కుకొని, రష్యా ఆర్మీలో చేరిన భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పలు వివరాలు సమర్పించింది. సుమారు 217 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరగా, అందులో 49 మంది యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో ఆరుగురు ఆచూకీ తెలియకుండా పోగా, మొత్తం 139 మందిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయం కృషి చేస్తోందని కేంద్రం తెలిపింది.
రష్యా వల: ఆశచూపి.. బలిపశువులుగా
రష్యా తమ సైన్యంలో చేర్చుకునేందుకు విదేశీయులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ప్రలోభపెట్టింది. నెలకు సుమారు 2,500 డాలర్ల జీతం, 5,000 డాలర్ల సైనింగ్ బోనస్, రష్యా పౌరసత్వం, మరణిస్తే 1,68,000 డాలర్ల పరిహారం ఇస్తామని నమ్మబలికింది. ఈ ఆశతోనే చాలా మంది భారతీయులు రష్యా సైన్యంతో స్వచ్ఛందంగా ఒప్పందాలు చేసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు తమ శిక్ష నుంచి విముక్తి పొందాలనే ఆశతోనే రష్యా ఆర్మీలో చేరడం గమనార్హం.
ప్రభుత్వ ప్రయత్నాలు- సవాళ్లు
ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం రష్యాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు 48 మందికి విమాన టిక్కెట్లను ప్రభుత్వం అందించింది. అయితే, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మృతదేహాలను గుర్తించడం, స్వదేశానికి తరలించడం అత్యంత క్లిష్టంగా మారిందని రష్యా అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల డిఎన్‌ఏ నివేదికలను ఇప్పటికే సేకరించి, రష్యన్ అధికారులకు అందజేశామని, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రభుత్వం తెలిపింది.
కోర్టు ముందు వాస్తవాలు
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం కీలక విషయాలను బయటపెట్టింది. పిటిషన్‌లో పేర్కొన్న 26 మందిలో ఇప్పటికే 14 మంది మరణించగా, 11 మంది ఆచూకీ తెలియలేదు. ఒక వ్యక్తి వేధింపుల కేసులో రష్యాలో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సంచలనం చేయవద్దని కోరిన కేంద్రం, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపింది.


