సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో జరిగిన మిస్ తెలుగు యూఎస్‌ఏ–2026 అందాల పోటీల్లో తెలుగు యువతులు సందడిచేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ చార్లెస్ డబ్ల్యూఎస్సీమాన్ సెంటర్‌లో ఈ పోటీలు సందడిగా జరిగాయి. అల్వాల్‌కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది. తమ కూతురు విజేతగా నిలవడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు శ్రీనివాస్‌రావు, రమలు తెలిపారు. ఇక మహిమ రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ప్రముఖ నటి లయ చేతులమీదుగా టైటిల్ అందుకున్నారు. గతంలో మిస్ ఫ్లోరిడా మెజెస్టిక్, ప్యూర్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో కూడా మహిమ గుర్తింపు పొందారు.
కిమ్స్ సన్‌షైన్‌లో స్పైన్ సూట్ టెక్నాలజీ
సనత్‌నగర్: స్సైన్ సర్జరీలో అధునాత స్పైన్ నావిగేషన్, హైస్పీడ్ డ్రిల్స్, ఖచ్చితత్వంతో కూడిన సర్జరీ టెక్నాలజీని కిమ్స్ సైన్‌షైన్ హాస్పటల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఏవీ గురువారెడ్డి తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్‌లో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడుం నొప్పితో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ చేస్తారనే అపోహ వద్దని..అవసరమైన వారికి మాత్రమే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆపరేషన్ చేస్తామన్నారు. వచ్చే వారం నుంచి బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్‌లో ఉచిత స్కోలియోసిస్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పైన్ సర్జన్ డాక్టర్ ఆంజనేయులురెడ్డి, డాక్టర్ అనాగ్ చక్రవర్తి, డాక్టర్ దినకర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం
సుల్తాన్‌బజార్: హైదరాబాద్ నగరం ఎంతో మంది కుస్తీవీరులను తయారుచేసి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపిందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం కోఠిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో అండర్–17 డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒక ప్రణాళిక రూపొందించి కుస్తీ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. అనంతరం అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంతోష్ పహిల్వాన్‌లు మాట్లాడుతూ... ఈ పోటీల్లో దాదాపు 200 మంది పాల్గొంటున్నారన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 13న జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రెజ్లింగ్ డిస్ట్రిక్ట్ సభ్యులు అస్లాం పహిల్వాన్, ఖాలీద్ పహిల్వాన్ పాల్గొన్నారు.
వినూత్న మార్పులకు సదస్సులు దోహదం
అంతర్జాతీయ కాంక్రీట్ పేవ్‌మెంట్ సదస్సు ప్రారంభం
సాక్షి,సిటీబ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న మార్పులకు అంతర్జాతీయ సదస్సులు దోహదపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం నగరంలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో 13వ అంతర్జాతీయ కాంక్రీట్ బ్లాక్ పేవ్‌మెంట్ సదస్సు నరెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాల రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంక్రీట్ బ్లాక్ టెక్నాలజీ కేవలం సౌందర్యం కోసమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.. నిర్మాణ వ్యర్థాల నుంచి సేకరించిన కాంక్రీట్ అగ్రిగేట్లను 50 శాతం వరకు వినియోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను 30 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు వెల్లడించారు. జర్మనీ, ఆస్ట్రియా, బ్రిటన్, కెనడా, అమెరికా వంటి దేశాల ఇంజనీర్లు, పరిశోధకులు, నిపుణులు పాల్గొన్నారు.


