ఐపీఎల్ వేళ అప్రమత్తంగా ఉండండి: కొత్వాల్
సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మ్యాచ్ ప్రిడిక్షన్ పేరుతో వల వేస్తున్న కొన్ని సంస్థలు సామాన్యులను ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నాయని నగర సీపీ సజ్జనర్ హెచ్చరించారు. మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఐపీఎల్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో ఆకర్షిస్తున్నారని తెలిపారు. కేవలం డబ్బు కోసం కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? అని ముందే చెబుతామంటూ చానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేయించుకుని, బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారని, ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ చానెళ్ల మాటలు నమ్మవద్దని సజ్జనర్ హితవు పలికారు. నెల రోజుల్లో 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను హైదరాబాద్ సైబర్ క్రైౖ మ్ విభాగం బ్లాక్ చేయించిందని వివరించారు. నిఘా నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


