వృత్తులేవైనా.. ప్రవృత్తి ‘డ్రగ్స్‌’ విక్రయం | - | Sakshi
Sakshi News home page

వృత్తులేవైనా.. ప్రవృత్తి ‘డ్రగ్స్‌’ విక్రయం

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌(హెచ్‌–న్యూ) రెండు రోజులు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో ఐదుగురు డ్రగ్స్‌ పెడ్లర్లు చిక్కారు. వీరి వృత్తులేమైనా డ్రగ్స్‌ విక్రయమే ప్రవృత్తిగా మారింది. వీరిని అరెస్టు చేసి రూ.63.65 లక్షల విలువైన ఐదు రకాల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ తెలిపారు. ఇన్‌స్పెక్టర్లు బి.వెంకట్‌, ఎస్‌.బాలస్వామిలతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

విద్యార్థిపై మూడు కేసులు...

బాలానగర్‌కు చెందిన సాయినిఖిల్‌ యాదవ్‌ బ్యాక్‌లాగ్స్‌ ఉండటంతో కొన్నాళ్లుగా ఇంటర్‌లోనే ఉండిపోయాడు. కాలేజీ రోజుల్లో చెడు స్నేహాల వల్ల సరదాగా డ్రగ్స్‌ వాడటం మొదలెట్టి బానిసగా మారాడు. ఆ ఖర్చుల కోసం తన కాలేజీలో సీనియర్‌, పెడ్లర్‌ అయిన ఆదిత్యకు సబ్‌–పెడ్లర్‌గా మారాడు. ఆరు నెలలుగా ఈ దందా చేస్తున్న ఇతడిపై ఇప్పటికే సనత్‌నగర్‌, జీడిమెట్లలో రెండు కేసులు ఉన్నాయి. సాయిని చిలకలగూడ పోలీసులతో కలిసి హెచ్‌–న్యూ బృందం అరెస్టు చేసి, 115 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న ఆదిత్య కోసం గాలిస్తోంది. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి టెలిగ్రాం యాప్‌ ద్వారా సంప్రదింపులు జరిపే సాయి.. సరుకు డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు తన ఫోన్‌ కాకుండా వేరే వారిది తీసుకెళ్లేవాడు.

ట్రాన్స్‌పోర్టర్‌ టు అంతర్రాష్ట్ర పెడ్లర్‌

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింహాచలానికి సాయి, సైబు, సిద్ధార్థ్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. సూరారంలో ఉంటూ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో గంజాయి, హష్‌ ఆయిల్‌ను ఒడిశా నుంచి ఆంధ్రాకు చేర్చే ట్రాన్స్‌పోర్టర్‌గా పనిచేశాడు. ఆపై అంతర్రాష్ట్ర పెడ్లర్‌గా మారి రెండు రాష్ట్రాల్లో సబ్‌–పెడ్లర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫోన్‌ వాడకుండా నేరుగా హష్‌ ఆయిల్‌ తయారీదారులను సంప్రదించి ఖరీదు చేస్తాడు. సంప్రదింపులకు ఇన్‌స్ట్రాగామ్‌, లావాదేవీలకు యూపీఐ వాడతాడు. ఇతడిపై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన వాలెట్‌ పార్కింగ్‌ డ్రైవర్‌ వేణు ఇదివరకు ఓ కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడ సింహాచలంతో పరిచయమై సబ్‌–పెడ్లర్‌గా మారాడు. సింహాచల్‌, వేణులను పోలీసులు అరెస్టు చేసి 1.05 కేజీల హష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఇద్దరిదీ అదే తరహా కథ...

ఇంజాపూర్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి అక్షయ్‌ పటేల్‌ గ్రాడ్యుయేషన్‌ తర్వాత శానిటరీ వ్యాపారం చేసి నష్టపోయాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి పలు సోషల్‌మీడియా యాప్స్‌ ద్వారా ఎక్స్‌టసీ, ఓజీ, ఎల్‌ఎస్‌డీ వంటి డ్రగ్స్‌ ఖరీదు చేస్తాడు. కొరియర్‌ ద్వారా వచ్చే వీటిని స్థానికంగా ఉన్న సబ్‌–పెడ్లర్స్‌కు విక్రయిస్తాడు. బైరామల్‌గూడకు చెందిన వ్యాపారి బి.ఆదిత్య వర్థన్‌ డ్రగ్స్‌కు బానిసగా మారి, డబ్బు కోసం అక్షయ్‌కు సబ్‌–పెడ్లర్‌ అవతారమెత్తాడు. ఈ ద్వయాన్ని అరెస్టు చేసిన పోలీసులు 363 ఎక్స్‌టసీ పిల్స్‌, 41 గ్రాముల ఓజీ, నాలుగు ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు ముఠాలకు సంబంధించి ఇప్పటి వరకు 15 మంది కస్టమర్లను గుర్తించారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement