– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్
గన్‌ఫౌండ్రీ: ప్రస్తుత సాంకేతిక యుగంలో గ్రంథాలయాలకు వెళ్లే పాఠకుల సంఖ్య తగ్గుతోందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో సమాజసేవలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న ప్రముఖ గ్రంథాలయాల అధ్యక్షులను ఘనంగా సత్కరించారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం (రాజమహేంద్రవరం) అధ్యక్షుడు డాక్టర్ ఎ. నారాయణరావు, శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం కార్యదర్శి పి.ఉడయవర్లు, సారస్వత నికేతనం అధ్యక్షుడు మల్లికార్జున్‌రావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, కిన్నెర కార్యదర్శి మద్దాలి రఘురాం తదితరులు పాల్గొన్నారు.


