– జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
సాక్షి, సిటీబ్యూరో: కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించనున్న ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలతో ఆస్తులు కోల్పోయే వారు నష్టపరిహారంగా నగదుకు బదులు టీడీఆర్‌లను స్వచ్ఛందంగా స్వీకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ కోరారు. కేబీఆర్ పరిసరాల్లో చేపడుతున్న ప్రాజెక్టులతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్, ముగ్ధ జంక్షన్లు తదితర ప్రాంతాల్లో ఆస్తులు కోల్పోనున్న వారితో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి సదరు ప్రాజెక్టులు అవసరమని వారికి వివరించారు. రహదారుల విస్తరణ పనుల గురించి సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తులు కోల్పోయేవారు టీడీఆర్‌లను స్వీకరించాల్సిందిగా కోరారు. నగరాభివృద్ధి దృష్ట్యా ప్రజల సహకారం కావాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


