అగ్నిప్రమాదంలో షాపింగ్‌మాల్‌ బుగ్గి | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో షాపింగ్‌మాల్‌ బుగ్గి

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

కిస్మత్‌పూర్‌ కాళీమందిర్‌ ప్రాంతంలో ఘటన

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కిస్మత్‌పూర్‌ కాళీమందిర్‌ ప్రాంతంలోని సిద్ధి వినాయక షాపింగ్‌ మాల్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మూడు అంతస్తులోని షాపింగ్‌ మాల్‌ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న అత్తాపూర్‌, లంగర్‌ హౌస్‌ ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు మూడు గంటలపాటు శ్రమించారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అర్ధరాత్రి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం, ఆ సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదంలో మాల్‌లోని వస్త్రాలన్నీ బుగ్గి అయ్యాయి. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు యాదవ్‌ తెలిపారు.

సైనికులు, గూఢాచారుల త్యాగాలను

ప్రతిబింబించిన దురంధర్‌: రాంచందర్‌రావు

సాక్షి, సిటీబ్యూరో: దేశ రక్షణకు సరిహద్దుల్లో పోరాడే సైనికులే కాకుండా, గూఢచారులు ఎంతటి త్యాగాలు చేస్తారో ధురంధర్‌–2 సినిమా స్పష్టంగా ప్రతిబింబించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సినిమాను వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, దేశ భద్రత కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటున్న గూఢచారుల నిజ జీవితాన్ని ఈ సినిమా మన కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుందని తెలిపారు. ఈ చిత్రంలో డీమానిటైజేషన్‌ వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాకుండా, అప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందన్నారు.

ఇన్‌స్టాలో పరిచయం.. బాలిక అదృశ్యం

మేడిపల్లి: మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్‌ ఫ్రెండ్స్‌ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి బాలిక ఉంటోంది. తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన రాత్రి విధులకు వెళ్లారు. తెల్లవారుజామున వారు ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మణి అనే ఓ వ్యక్తితో తరచూ చాట్‌ చేస్తున్నట్లు గుర్తించామని, అదృశ్యం వెనుక అతడు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆటో ఢీ కొని వృద్ధురాలి మృతి

టిఫిన్‌ చేసి చెట్టు కింద కూర్చున్న కాసేపటికే ఘటన

అల్వాల్‌: ఆటో ఢీ కొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్‌కు చెందిన కందూరి కనకమ్మ(80) అల్వాల్‌ వెస్ట్‌ వెంకటాపురం బ్రిడ్జి వద్ద టిఫిన్‌ చేసి అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చుంది. కాసేపటికే అటుగా వచ్చిన ఓ ఆటో ఆమెను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

180 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు

సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో మంగళవారం న్యూ టౌన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 180 మంది ఉద్యోగులు రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వెంకటాచారి, స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ జ్యోతి, లా ఆఫీసర్‌ శ్రీధర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి, డా. చల్లా దేవి పాల్గొన్నారు.

కల్తీ నిరోధంపై సీఎం నిర్ణయం హర్షణీయం

పంజగుట్ట: ఆహార కల్తీని నియంత్రించేందుకు హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయమని, ఆ పని త్వరగా చేయాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి చైర్మన్‌ డాక్టర్‌ పల్లెపాడు దామోదర్‌ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణితో కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక విభాగం లేకపోవడం వల్లే ఆహార కల్తీని నియంత్రించలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రతిరోజు ఏదోఒకచోట కుళ్లిన మాంసం, కల్తీ పాలు, సీసంతో ఉన్న పసుపు లాంటివి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విజయ పాలను రైతుల వద్ద సరైన రేటు ఇచ్చి కొనుగోలు చేసి ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. ఆహార కల్తీ అరికట్టేందుకు పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు మామిడి భీమిరెడ్డి, ఎ.వి.రావ్‌, శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మంటల్లో సిద్ధి వినాయక షాపింగ్‌ మాల్‌

Advertisement
 
Advertisement
Advertisement