ఎయిర్‌పోర్టులో 14 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో 14 కిలోల గంజాయి పట్టివేత

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

శంషాబాద్‌: బ్యాంకాక్‌ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 14 కిలోల గంజాయిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... థాయ్‌ ఎయిర్‌వేస్‌ టీజీ–329 విమానంలో సోమవారం రాత్రి 12 గంటల సమయంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సొదా మోసిన్‌ బహదూర్‌ అనే ప్రయాణికుడు చేరుకున్నాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 14 కేజీల హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎయిర్‌పోర్ట్‌ ఇంటలిజెన్స్‌, కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

స్పా సెంటర్‌ ముసుగులో వ్యభిచారం

– ఇద్దరి అరెస్ట్‌.. రెస్క్యూహోమ్‌కు నలుగురు మహిళలు

మలక్‌పేట: స్పా సెంటర్‌ ముసుగులో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రంపై మలక్‌పేట పోలీసులు సోమవారంరాత్రి దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. మలక్‌పేట ఏసీపీ సుబ్బారామిరెడ్డి తెలిపిన వివరాలు.. దిల్‌సుఖ్‌నగర్‌ విద్యుత్‌నగర్‌లో నివాసముంటున్న నిఖిలేష్‌(27) మూసారంబాగ్‌ డివిజన్‌ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌ సర్వీస్‌ రోడ్‌లో కొంతకాలంగా డైమాండ్‌ స్పా సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అయితే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ పిడమర్తి నరేష్‌ పోలీస్‌ సిబ్బందితో దాడి చేసి చిలుకలగూడకు చెందిన పవన్‌(29), నలుగురు మహిళలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిఖిలేష్‌, పవన్‌ను అరెస్ట్‌ చేయగా, మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఎస్‌ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్‌ నేరాలు ఛేదించి.. రూ.1.59 కోట్లు రిఫండ్‌

సాక్షి, సిటీబ్యూరో: నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు మార్చిలో వివిధ కేసులను ఛేదించి బాధితులకు రూ.1.59 కోట్లు రిఫండ్‌ చేశారు. దీనికి అదనంగా జోనల్‌ సైబర్‌ సెల్స్‌ మరో రూ.95.99 లక్షలు రిఫండ్‌ చేశాయి. గత నెలలో సైబర్‌ ఠాణాలో 54 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, గోవా, కేరళ, రాజస్థాన్‌ల్లో దాడులు చేసి 20 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌, గేమింగ్‌, జాబ్‌ తదితర ఫ్రాడ్స్‌లో నిందితులు. గత నెలలో బాధితులు 23 ఆర్థిక సంబంధిత సైబర్‌ నేరాల్లో రూ.4.40 కోట్లు కోల్పోయారు.

సాయిబాబాకు సనాతన ధర్మానికి సంబంధం లేదు

– స్వచ్ఛ సనాతన వేదిక

పంజగుట్ట: షిరిడీ సాయిబాబాకు సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదని స్వచ్ఛ సనాతన వేదిక పేర్కొంది. శ్రీ షిరిడీ సంస్థాన్‌ వారు రాసిన సాయిబాబా సత్య చరిత్ర పుస్తకంలోని కొన్ని అంశాలపై ప్రశ్నలు అడిగిన తమపై అక్రమ కేసులు బనాయించి, పరువునష్టం దావా వేయడం ఎంతవరకు సబబని స్వచ్ఛ సనాతన వేదికలోని హిందూ జనశక్తి ప్రతినిధి లలిత్‌ కుమార్‌, శివశక్తి ప్రతినిధి కరుణాకర్‌ సుగుణ, భరత వర్ష ప్రతినిధి శివ, హైందవీ స్వరాజ్‌ భాస్కర్‌ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చర్చకు తాము సిద్ధమని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ ఫొటోలతో షిరిడీ, మహారాష్ట్రల్లో పోస్టర్లు వేయించారని, దాడులు చేయిస్తామని హెచ్చరించారని, ఇది భావప్రకటన స్వేచ్చపై దాడి చెయ్యడమేనని అన్నారు.

తల్లి మందలించిందని బాలుడి అదృశ్యం

శంషాబాద్‌ రూరల్‌: పాఠశాలకు వెళ్లని కొడుకును తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పాల్మాకులకు చెందిన వరికుప్పల అరుణ కొడుకు అనిల్‌కుమార్‌ స్థానికంగా జిల్లా పరిషత్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వారం రోజులుగా బడి మానేసి వేరే పిల్లలతో కలిసి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్తున్నాడు. విషయం తెలియడంతో తల్లి అతడిని మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 5న ఉదయం అరుణ పనికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూడగా కొడుకు కనిపించలేదు. అతని కోసం అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement