లబ్ధిదారులకు పట్టా అందజేసిన చిన్నారెడ్డి
లక్డీకాపూల్: సీఎం ప్రజావాణి చొరవతో జనార్దన్–పద్మజ దంపతులకు డబుల్ బెడ్రూమ్ మంజూరైంది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ వేదికగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ ఇంటి పట్టాను సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్స్ సెల్ అధ్యక్షుడు శ్యాంమోహన్‌లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి జిల్లా మద్దూంపల్లికి చెందిన జనార్దన్ నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఖైరతాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల డబుల్ బెడ్రూమ్ కోసం సీఎం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా కూకట్‌పల్లిలోని కై త్లాపూర్‌లో కేటాయిస్తూ మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టర్ మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మంగళవారం జరిగిన 212వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 505 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ సూర్యప్రకాష్, ఏసీపీ ఉమేందర్, ఎన్‌ఆర్‌ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రవాసీ ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


