
తవ్విపోదురు గాక..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వానలొస్తే జనం చస్తున్నారు. ఉప్పొంగే నాలాలు.. చెరువులయ్యే రోడ్లతో ముందుకు సాగలేక అల్లాడుతున్నారు. ఎప్పుడో వేసవిలోనే పూర్తి చేయాల్సిన పనుల్ని సైతం పెండింగ్‌లో పెట్టి.. జలమండలి, టెలికాం, తదితర సంస్థలు అడ్డంగా తవ్విపారేసిన రోడ్లతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఏ పనులు ఏ సంస్థవో తెలియని సామాన్య ప్రజలు అన్నీ జీహెచ్‌ఎంసీవేనని భావించి దుమ్మెత్తిపోస్తున్నారు. జీహెచ్‌ఎంసీ చేయాల్సిన పనులకూ ట్రాఫిక్ విభాగం నుంచి సకాలంలో అనుమతులు లభించడం లేవని సమాచారం. ఇవి సమస్యలకు కారణాలు కాగా.. వర్షాకాల సమస్యల పరిష్కార బాధ్యతలు హైడ్రాకు అప్పగించాక వాటిలోనూ సమన్వయం కుదరడం లేదు. ప్రకటనల్లో మాత్రం సమన్వయంతో పని చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలోని హైడ్రా సిబ్బంది జీహెచ్‌ఎంసీని ఖాతరు చేయడం లేదని తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా మ్యాన్‌హోళ్ల మూత లు, డివైడర్ల చివరన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించకపోవడంతో వరదనీరు నిలిచిపోతోంది.
అనుమతుల్లేకుండా అడ్డగోలు తవ్వకాలు
● హైదరాబాద్ మెట్రో వాటర్ సప్‌లైఅండ్ సివరేజి బోర్డు (జలమండలి) నిర్వాకాలు శాపంగా మారాయి. తాగునీరు, మురుగునీటి పైపులైన్ల కోసం ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా జరిపిన తవ్వకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో చేయాల్సిన మ్యాన్‌హోళ్ల పనులు ఇప్పుడు చేస్తున్నారు. పనులు చేశాక సరిగా చదును చేయడం లేదు. సివర్ లైన్ల కోసం తవ్వకాలు జరిపీ, మట్టికుప్పలు అడ్డగోలుగా వదిలేస్తున్నారు. దాంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
● ఉదాహరణకు ఎన్‌ఎండీసీ– విజయనగర్ కాలనీరోడ్ మార్గంలో తవ్వకాలు జరిపి రోడ్డు మూసేశారు. దాంతో ఇతర దారుల్లో తీవ్రట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్వి పారేశారు. ఇవన్నీ ఎలాంటి అనుమతుల్లేకుండా తవ్వినవే. మురుగునీటిని వరద కాల్వల్లో కలపడంతో వాటిలో మురుగు పొంగుతోంది. వర్షాల వేళ రోడ్లపై పెద్ద ప్రవాహాలు ఏర్పడుతున్నాయి. చాదర్‌ఘాట్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో తరచూ కనిపించే దృశ్యాలే ఇందుకు నిదర్శనం. ఇక వర్షాల వేళ ట్రాఫిక్ విభాగం పనితీరు సోమ వారం నాటి వర్షంతో బట్టబయలైంది. సాధారణంగా పది నిమిషాల్లో వెళ్లాల్సిన దూరానికి రెండు గంటలకు పైగా పట్టింది. చలానాల విధింపుపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకిలా?
వర్షాకాలానికి ముందే వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రజల సదుపాయార్థం తాము చేయాల్సిన పనులుంటే పరస్పర సమన్వయం, సహకారంతో పూర్తిచేయాలి. కానీ అది జరగడం లేదు. ఉదాహరణకు ఒక రోడ్డు వేయాలంటే ఆ మార్గంలో ఏర్పాటు చేయాల్సిన ఇతర విభాగాల పనులుంటే పూర్తయ్యాక వేయాలి. కానీ అది జరగడం లేదు. జీహెచ్‌ఎంసీ రోడ్లు వేయడం.. ఇతర విభాగాలు తవ్వడం.. మళ్లీ రోడ్లు వేయడం పరిపాటిగా మారింది. సకాలంలో ట్రాఫిక్ అనుమతులు లభించకపోవడం కూడా పనుల జాప్యానికి కారణమవుతోంది. బంజారాహిల్స్‌లో నాలాలో కుంగిన వాటర్‌ట్యాంకర్‌ను బయటకు తీసేందుకు కూడా ఎంతో సమయం పట్టడాన్ని ప్రజలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఆ తప్పు ఎదుటివారి మీదకు నెట్టడం.. ప్రశంసలైతే తామే అని చెప్పుకోవడం అన్ని విభాగాలకూ అలవాటుగా మారింది.
సమన్వయం బూటకం.. సమస్యలే వాస్తవం
వర్షాల వేళ ఎవరి దారి వారిదే
అడ్డదిడ్డంగా ప్రభుత్వ విభాగాలు పనితీరు
తవ్విపారేసిన రోడ్లతో నరక యాతన
నగర వాసులకు తప్పని వరద కష్టాలు