
ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్
ప్రయోగాత్మకంగా బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో అమలు
బాలానగర్: సాధారణంగా ప్రాథమిక సమాచార నివేదిక కోసం ఫిర్యాదుదారులు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాగా.. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు గురువారం బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఐ నర్సింహరాజు నేతృత్వంలో ప్రయోగాత్మకంగా ఇంటి వద్దే గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వయోవృద్ధుల ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నేరుగా వారి ఇంటికి వెళ్లి ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు. ఈ సందర్భంగా సీఐ నర్సింహరాజు మాట్లాడుతూ.. న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం అనేకసార్లు పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా చూసేందుకు వయోవృద్ధులు, వికలాంగుల ఫిర్యాదులను పరిశీలిస్తామన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వారి ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ కాపీని అందజేస్తే ప్రజలకు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుందని తెలిపారు. సున్నితమైన కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు మఫ్టీలో వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తామని వివరించారు.