
ముఠా ఆటకట్టు
వీసా, పాస్‌పోర్టుల ట్యాంపరింగ్
శంషాబాద్: వీసా, పాస్‌పోర్టులను ట్యాంపరింగ్ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా విజిటింగ్ వీసాలపై అమాయకులను ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపుతున్న ఓ ముఠాలోని ఇద్దరు సభ్యులను ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు, శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 13న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకటరమణమ్మ కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఆమె పాస్‌పోర్టు, వీసాలను పరిశీలించిన అధికారులు ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించి ఆమెను అడ్డుకున్నారు. దీంతో బాధితురాలు ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు మరికొందరికి ఇదే తరహాలో పశ్చిగోదావరి జిల్లాకు చెందిన ఏజెంట్లు కువైట్‌లో ఉద్యోగానికి పంపేందుకు తప్పుడు వీసాలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన సత్యనారాయణ, చిలుకూరు బాలాజీ, హైదరాబాద్‌కు చెందిన అంజి, కడప జిల్లాకు చెందిన సుంకర శివకుమార్, గోపాల్ ముఠాగా ఏర్పడి గల్ఫ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. నిరక్షరాస్యులు, అమాయకులను టార్గెట్ చేసుకుని కువైట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వర్కింగ్ వీసా కోసం నిబంధనల ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేంట్ సర్టిఫికెట్ ఉండాల్సి ఉండగా వీరు దానిని తీసుకోకుండా వర్కిగ్ వీసా రద్దయినట్లు నకిలీ స్టాంపులతో క్యాన్సిల్డ్ ముద్రలు వేస్తున్నారు. అనంతరం బాధితులకు విజిటింగ్ వీసాలు అందజేసి ముందుగా మస్కట్‌కు పంపి అక్కడి నుంచి వారిని కువైట్‌కు పంపుతున్నారు. ఈ క్రమంలో పాస్‌పోర్టు, వీసాలను ట్యాంపరింగ్ చేయడంతో పాటు పీఓఈ సర్టిఫికేట్ లేకుండా విదేశాలకు పంపుతున్నారు. విజిటింగ్ వీసాలపై వెళుతున్న అమాయకులు పలు ప్రాంతాల్లో పట్టుబడుతూ మోసపోతున్నారు. నిందితుల ఆచూకీపై సమాచారం అందడంతో గురువారం నాంపల్లిలోని ఓ హోటల్‌పై దాడి చేసి చిలుకూరి బాలాజీ, సుంకర శివకుమార్‌లను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.వీరి నుంచి ట్యాంపరింగ్ చేసిన 14 వీసాలు, 14 పాస్‌పోర్టులు, 16 విమాన టికెట్లు, 2 నకిలీ స్టాంపులు, ఏడు సెల్‌ఫోన్లు, 1 ల్యాప్‌టాప్ స్వాఽధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఆర్‌జీఐఏ ఔట్ పోస్టు సీఐ బాలరాజు, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్, ఎస్‌ఐ సిద్దేశ్వర్ తదితరులను ఏసీపీ అభినందించడంతో పాటు రివార్డులను అందజేశారు.
మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి
నలుగురి ముఠా సభ్యుల్లో ఇద్దరి అరెస్ట్
ఉద్యోగాల పేరుతో విజిటింగ్ వీసాలపై
విదేశాలకు పంపుతున్న వైనం