సుమేధ.. ఆనంద్‌సాయి.. మౌనిక ఇంకెందరు..?

- - Sakshi

హైదరాబాద్: మహా నగరంలో వానాకాలంలోనే కాదు.. ఎప్పుడు వర్షం వచ్చినా ప్రాణాలు పోయే పరిస్థితులు దాపురించాయి. గత మూడేళ్లుగా నాలాల్లో పడి పసివాళ్లు మరణిస్తుండటం నగర ప్రజల హృదయాల్ని కలచివేస్తోంది. అభం శుభం తెలియని పసివాళ్లు నాలాలకు బలవుతున్నా.. సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తుండటం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ప్రభుత్వ విభాగాల సమన్వయం లోపం కూడా ఇందుకు కారణం. రెండేళ్లక్రితం నేరేడ్‌మెట్‌లో సుమేధ అనే బాలిక మరణంతో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అందుకనుగుణంగా రూ.300 కోట్లు కేటాయించారు. పనులు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. కానీ నాలాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు మాత్రం మారలేదు. పనులు జరిగే ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించని నిర్లక్ష్యం వల్లే తాజాగా సికింద్రాబాద్‌ కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి మృతి చెందింది. చిన్నారులతో పాటు పెద్దలూ నాలాల్లో పడి మృతి చెందారు.

గత ఆరేళ్లలో నాలా మృతులు ఇలా..

► 2017 ఫిబ్రవరిలో యాకుత్‌పురా నియోజకవర్గంలో నాలాలోపడి రెండేళ్ల జకీఅబ్బాస్‌ అనే బాలుడు మరణించాడు.

2018 సెప్టెంబర్‌లో సరూర్‌నగర్‌లో నాలాలో పడి హరీష్‌ అనే యువకుడు మృతి చెందాడు.

2019లో సెప్టెంబర్‌లో నాగోల్‌ సమీపంలోని ఆదర్శనగర్‌ నాలాలో పడి పోచంపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ మరణించాడు.

2020 సెప్టెంబర్‌లో నేరేడ్‌మెట్‌లో సుమేధ అనే 12 ఏళ్ల బాలిక నాలాలో పడిపోయి అసువులు బాసింది.

2021లో ఓల్డ్‌బోయిన్‌పల్లిలో ఆనంద్‌ సాయి అనే ఏడేళ్ల బాలుడు నాలాకు బలయ్యాడు.

అంతకుముందు సైతం పలు సందర్భాల్లో పలువురు నాలాల్లో పడి అసువులు బాశారు.

హైదరాబాద్: ఈదురు గాలితో కూడిన వర్షానికి విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అతలాకుతలమైంది. శనివారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి గ్రేటర్‌ జిల్లాల్లో 218 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌ బర్కత్‌పురా నాలాకు ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభం నేలకూలింది. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నాలాలో పడిపోయింది. రాజేంద్రనగర్‌, సికింద్రాబాద్‌, హబ్సిగూడ సర్కిళ్లలో లైన్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

పలు ప్రాంతాల్లో వైర్లు తెగిపడ్డాయి. సబ్‌స్టేషన్లలోని ఫీడర్లు ట్రిప్పవడంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి రెండు గంటల్లోనే సరఫరాను పునరుద్ధరించగా ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, తదితర ప్రాంతాల్లో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా కరెంట్‌ సరఫరా కాలేదు. దీంతో ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీల్లో అంధకారం నెలకొంది. ఉక్కపోతకు తోడు దోమలు కంటిమీదకునుకు లేకుండా చేశాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top