
ఎయిర్‌పోర్టు మెట్రో మార్గంలో సోమవారం భూసామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి.
సాక్షి, సిటీబ్యూరో: ఎయిర్‌పోర్టు మెట్రో మార్గంలో సోమవారం భూసామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అలైన్‌మెంట్ స్థిరీకరణ, పెగ్‌మార్కింగ్ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఐకియా జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 100 మెట్రో పిల్లర్లను నమూనాగా తీసుకొని భూసామర్థ్య పరీక్షలను చేపట్టినట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సుమారు రెండు నెలల్లో ఈ పనులను పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మెట్రో స్తంభాల నిర్మాణం ప్రతిపాదించిన ప్రతి చోట భూమి ఉపరితలం నుంచి సుమారు 40 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుపుతారు.
‘ఇన్–సిటు’ (అక్కడికక్కడ) పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రయోగశాల మట్టి నమూనా పరీక్షలు కూడా నిర్వహించి భూసామర్థ్యాన్ని నిర్ణయిస్తారు. ఈ పరీక్షల వల్ల స్తంభాల పునాదులను ఏ మేరకు తవ్వాలనే అంశంపై ఒక స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓపెన్ ఫౌండేషన్, ఫైల్ ఫౌండేషన్, బేరింగ్ ప్రెజర్‌ను ఏ మేరకు అనుమతించవచ్చనే అంశాలు తెలుస్తాయి. మరోవైపు ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల టెండర్ ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్‌లకు కూడా ప్రాజెక్టు నిర్మాణం జరిగే భూమి తీరుపై ఒక అవగాహన కలుగుతుంది.
దీంతో తగినవిధంగా ఆర్థిక అంచనాలను రూపొందించుకొని టెండర్‌లలో పాల్గొనగలుగుతారు. చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ బి. ఆనంద్‌మోహన్, సూపరింటెండెండ్ ఇంజనీర్ సాయపరెడ్డిల నేతృత్వంలోని హెచ్‌ఏఎంఎల్ ఇంజనీరింగ్ బృందం భూసామర్థ్య పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ పోలీసు తదితర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ పనులు జరుగుతున్నాయి. పనులు జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన బారికేడింగ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.