
సాక్షి, సిటీబ్యూరో: మహానగర పరిధిలోని బహుళ అంతస్తుల భవనాలకు నీటి అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట పడటంలేదు. జలమండలి క్షేత్ర స్థాయి సిబ్బంది అండదండలతో ఈ వ్యవహరం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది. కొందరు బహుళ అంతస్తుల యాజమానులు కేవలం గృహ వినియోగ కనెక్షన్ మాత్రమే అధికారికంగా తీసుకొని అనధికారికంగా రెట్టింపు ఎంఎం సైజు నల్లాను ఏర్పాటు చేసుకుంటుండగా, మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కనెక్షన్లతో నీటిని వినియోగస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పాత నివాస గృహాల స్థానంలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌లలో పాత కనెక్షన్లు పునరుద్ధరించుకోవడం, అనుమతి కంటే అదనపు అంతస్తులను నిర్మించుకున్న అపార్ట్‌మెంట్‌లకు ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసుకోవడం షరామామూలుగా మారింది. స్థానికులు ఫిర్యాదు చేసి ఒత్తిడి తేస్తేనే అధికార గణంలో చలనం లేకుండా పోయింది. ఫిర్యాదులపై మొక్కుబడి తనిఖీల్లోనే డబుల్, ట్రిపుల్ అక్రమ కనెక్షన్లు గుట్టలుగా బయటపడటం ఇందుకు బలం చేకూర్చుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఉదాసీన వైఖరీ క్షేత్రస్థాయి సిబ్బంది ఆమ్యామ్యాలు అక్రమ కనెక్షన్ల వ్యవహారానికి ఊతం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తప్పనిసరి
నగరంలో సుమారు 200 చదరపు మీటర్ల విస్తీర్ణం లేదంటే 7 మీటర్ల ఎత్తు నిర్మించిన భవనాలకు నల్లా కనెక్షన్‌్ కావాలంటే జీహెచ్‌ఎంసీ జారీ చేసే ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఒకవేళ ఆక్యుపెన్సీ లేని ఇళ్లు, భవనాలకు నీటి కనెక్షన్ జారీ చేయాలంటే.. మూడు రెట్లు నీటి బిల్లులు చెల్లించాలని నిబంధన. సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలు లేని భవన సముదాయాలకు నల్లాలు అక్రమంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం విస్మయానికి గురిచేస్తోంది. ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది, నల్లా కనెక్షన్లు మంజూరు చేసే గ్రీన్ బ్రిగేడ్ సిబ్బంది, ప్రైవేటు ప్లంబర్ల పాత్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు. దర్జాగా రోడ్డు సైతం తవ్వి భూమి లోపలున్న మంచినీటి పైపులైన్లకు రంధ్రం వేసి అక్రమ కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి నిర్మించుకున్న ఆక్యుపెన్సీ ధ్రువీకరణ లేని భవనాలు సుమారు లక్షకు పైగా ఉంటాయని అంచనా.
భవంతులను బట్టి చార్జీలు..
బహుళ భవంతులకు నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులు, ఫ్లాట్ల సంఖ్య ఆధారంగా నల్లా కనెక్షన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జలమండలికి నిబంధనల మేరకు కనెక్షన్ చార్జీలు చెల్లించాలంటే రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యన ఖర్చు అవుతుంది. కొందరు బిల్డర్లు క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో సదరు భవనానికి అక్రమ నల్లాలు ఏర్పాటు చేయించి చేతులు దులుపుకొంటున్న ఘటనలు అనేకం.
సిబ్బందికి ఆదాయ వనరు
క్షేత్రస్థాయి సిబ్బందికి అక్రమ నల్లా కనెక్షన్ల ఆదాయ వనరులుగా మారాయి. దీంతోనే సిబ్బంది బాహాటంగా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం క్షేత్రస్థాయిలో వాటర్ లైన్‌మన్, నీటి మీటర్ రీడర్లు రెగ్యులర్‌గా ఆయా కాలనీల్లో పర్యటిస్తుంటారు. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లకు నీళ్లు సరిపోవడం లేదని వారి దృష్టికి తీసుకొస్తే అక్రమ కనెక్షన్ ఏర్పాటుకు ఉచిత సలహా ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ఈ క్రమంలో అక్రమార్కుల నుంచి భారీగానే ముడుపులు దండుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే.
లక్షన్నర పైనే అక్రమ కనెక్షన్లు..
జలమండలి పరిధిలో సుమారు లక్షన్నర వరకు అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధిక వాటా అపార్ట్‌మెంట్లదే. ఇది జలమండలి వర్గాల్లో బహిరంగ రహస్యమే. భూమి లోపల ఉన్న నీటి సరఫరా పైపులైన్లకు రంధ్రాలు చేసి అక్రమంగా నల్లాలను ఏర్పాటు చేసుకోవడం, వాటిపై యథావిధిగా మట్టి పోస్తుండటంతో గుర్తించడం కష్టంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో భూమి లోపలున్న అక్రమ నల్లాల గుట్టు తవ్వి చూసినప్పుడే రట్టవుతోంది. లేకుంటే స్థానికులు ఫిర్యాదు ఒత్తిడితో తనిఖీ చేసినపుడే ఇవి బయట పడుతుండడం గమనార్హం. ముఖ్యంగా బహుళ అంతస్తుల నివాస సముదాయాలతోపాటు వాణిజ్య భవనాలు, హోటళ్లు, హాస్టళ్లు, మాల్స్, మెస్‌లు, ఫంక్షన్ హాళ్ల వంటి వాణిజ్య భవనాలు సైతం అక్రమ కనెక్షన్లను వినియోగిస్తున్నట్లు సమాచారం.