
మాట్లాడుతున్న సీవీ మోహన్ రెడ్డి చిత్రంలో జస్టిస్ జి.రఘురామ్
నాంపల్లి: అసమ్మతిలేని ప్రజాస్వామ్యం శ్మశానంలో నిశ్శబ్ధం లాంటిదని ఏపీ హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి అన్నారు. అసమ్మతిలేని ప్రజాస్వామ్యం ఉండదని, అసమ్మతిని అణగదొక్కే ప్రభుత్వాలు నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వాలన్నారు. శుక్రవారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, స్వర్గీయ అల్లాడి కుప్పుస్వామి శత జయంతి స్మారకోపన్యాస కార్యక్రమం జరిగింది. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.రఘురామ్ అధ్యక్షతన ఏర్పాటైన సభకు హాజరైన సీవీ మోహన్ రెడ్డి ‘ప్రజాస్వామ్యం–అసమ్మతి–భారత రాజ్యాంగం’ అంశంపై మాట్లాడారు. డేవిడ్ క్లార్క్ రాసిన ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ లా అండ్ సొసైటీలోని భావనను ప్రస్తావిస్తూ సమన్యాయ పాలన అమలులో ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం, అసమ్మతి అనేవి ప్రభుత్వానికి– ప్రజలకు మధ్య బలమైన పౌర సమాజం, రాజకీయ క్రియాశీలత ఏర్పాటుకు దోహదపడతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124 ఏ(రాజద్రోహం) ఎక్కువగా ఉపయోగించడాన్ని ఆయన తప్పుబట్టారు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు పలువురు ఈ సెక్షన్ కింద బ్రిటీష్ ప్రభుత్వంతో శిక్షింపబడ్డారని, అందుకే వారు సెక్షన్ 124 (ఏ) కొనసాగింపును వ్యతిరేకించారని గుర్తు చేశారు. కె.ఎం.మున్షీ తదితరులు ప్రజాస్వామ్య సారాంశం ‘అసమ్మతే’ అని రాజ్యాంగ పరిషత్‌లో అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు కూడా కేదార్‌నాథ్ కేసులో సెక్షన్ 124(ఏ) ను దుర్వినియోగం చేయవద్దని సూచించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ప్రముఖ న్యాయమూర్తులు వెలువరించిన ముఖ్యమైన తీర్పులను విశ్లేషించారు. ప్రతి దశలోనూ సమాజం కొన్ని నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తుందని, అయితే కొత్త ఆలోచనలు ఆచరణరూపం దాల్చేందుకు స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, సంఘసేవకులు, పౌరసమాజ సభ్యులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.
సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి