
సాక్షి, సిటీబ్యూరో: పవిత్ర రంజాన్ నెల రానే వచ్చింది. నెలవంక కనిపించిన వెంటనే మత గరువులు రంజాన్ మాసాన్ని ప్రటిస్తారు. రంజాన్ అనగానే ఆహారప్రియులకు గుర్తుకొచ్చేది వేడివేడి హలీం. ఈ మాసంలో ముస్లింలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా హలీంను ఆరిగిస్తారు. గడచిన మూడేళ్లుగా కరోనా మహమ్మారి హలీం విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో హలీం కేంద్రాల నిర్వాహకులు పూర్తి స్థాయిలో హలీంను తయారు చేయలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో హలీం విక్రయాలు జోరుగా సాగుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
► ప్రతికూల పరిస్థితులను అధిగమించి నగరంలో హలీం సందడి ప్రారంభమైంది. హలీం తయారీకి వినియోగించే డేక్షాలకు ఖలాయి (సిల్వర్‌తో పూత)లు వేస్తున్నారు.
► హలీం తయారీలో కీలకమైన గోఠాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గోధుమలు, మటన్‌ను దంచడానికి గోఠాలను వినియోగిస్తారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో డేక్షాలకు ఖలాయి వేస్తున్నారు.
► నగరంలోని అన్ని హోటళ్లలో హలీం తయారీ, విక్రయాల ఏర్ప్పాట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. వేడివేడి హలీంను అందించడానికి పెద్దస్థాయిలో హలీం డేక్షాలతో బట్టీలను నిర్మిస్తున్నారు.
► హోటళ్లలోనే కాకుండా ఫంక్షన్ ప్యాలెస్‌లు, మైదానాలు, గల్లీల్లోనూ హలీం బట్టీలను నిర్మిస్తున్నారు.
► రంజాన్ మాసంలో నగరంలో 5 వేలకు పైగా హలీం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. హోటళ్లు, చౌరస్తాలు, గల్లీలు తదితర ప్రాంతాల్లో హలీం కేంద్రాలు అందుబాటులో రానున్నాయి. కరోనా కారణంగా మూడేళ్లుగా హలీం తయారీ లేకపోవడంతో ఈ సారి జనం నుంచి ఎక్కువ డిమాండ్ ఉంటుందనే అంచనాలో నిర్వాహకులు ఏర్పాట్లను భారీస్థాయిలోనే చేస్తున్నారు.
► ఈ సంవత్సరం నూనె, పప్పులు, మటన్, చికెన్‌తో పాటు మసాలాల ధరలు ఎక్కువగా ఉండటంతో హలీం ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్లేట్ హలీం రూ. 200 మొదలుకొని రూ. 260 వరకు విక్రయిస్తున్నారు. ప్రధాన హోటళ్లు, కేంద్రాలు, బ్రాండెడ్ తయారీదారుల హలీం ధరలైతే మరింత అధికంగానే ఉన్నాయి.
