మాంసపు వ్యర్థాలు రోడ్లపై వేస్తే కఠిన చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. గురువారం వివిధ శాఖల అధికారులతో తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు.

నగరంలో కుక్కల బెడద నివారణకు నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి స్టెరిలైజేషన్‌ కార్యక్రమాలు చేయాలని అధికారులను ఆదేశించారు. బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలో కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

రోడ్లపై కుక్కలకు ఇష్టమొచ్చినట్లుగా ఆహారం వేయడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపై వేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కుక్కలు ఎక్కువగా చేరడానికి కారణమవుతోందని పేర్కొన్నారు. మటన్‌, చికెన్‌ షాపుల వద్ద శుక్రవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా రోడ్లపై మాంసపు వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కల విషయంలో ప్రస్తుతం 8 ప్రత్యేక టీములతో స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నట్లు చెప్పారు.

సమస్యలు పరిష్కరిస్తాం..
కోతులు, కుక్కల కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌ (040–21111111)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వాటి ద్వారా ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. కోతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ప్రత్యేక అనుభవం ఉన్న వారి ద్వారా నగరంలోని కోతులను పట్టుకొని అటవీ శాఖ అధికారుల సమన్వయంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌, పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అధర్‌ సిన్హా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, అడిషనల్‌ కమిషనర్‌ శ్రుతిఓజా (హెల్త్‌), పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ రాంచందర్‌, జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top