న్యూస్‌రీల్
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్–హనుమకొండ జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పోరా టాలకు కేంద్రంగా నిలిచిన ఈ ప్రాంతం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రంగా మారింది. 2014లో పలు సమస్యలు ఉన్న నగరంలో నేడు విద్య, వైద్యం, రహదారులు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు, పర్యాటకం, ఐటీ తదితర రంగాల్లో పురోగతి సాధించాయి. రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్లలో జీడబ్ల్యూఎంసీ పరిధిలో అనేక ప్రాజెక్టులు పూర్తికాగా.. హనుమకొండ జిల్లా పరిపాలన, విద్య, వైద్య కేంద్రంగా మరింత బలోపేతమైంది.
మౌలిక సదుపాయాలు : నగరంలో 2014కు ముందు ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండేవి. 2014 తర్వాత పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులతో నగర రూపురేఖలు మారాయి.
తాగునీరు : వేసవిలో తాగునీటి కొరత ఉండేది. ఇప్పుడు మిషన్ భగీరథతో సమస్య పరిష్కారమైంది.
వైద్యం: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, ఎంజీఎం విస్తరణ, కేఎంసీ బలోపేతంతో నగరం ప్రముఖ వైద్య కేంద్రంగా ఎదిగింది.
విద్య: గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కేయూతో విద్యారంగం బలోపేతమైంది.
పర్యాటక, సాంస్కృతిక రంగం: వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం పరిసరాల అభివృద్ధి, కాకతీయ కళాతోరణం ప్రాచుర్యం, పర్యాటకులకు వసతులు మెరుగుపడ్డాయి.
ఐటీ : తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐటీ కంపెనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించింది.
అభివృద్ధి: నగరాభివృద్ధి హంటర్ రోడ్డు, మడికొండ, కాజీపేట, నయీంనగర్, వడ్డేపల్లి, ఎల్కతుర్తి రోడ్డు వైపు విస్తరించింది.
హనుమకొండ జిల్లా ప్రత్యేకత..
తెలంగాణలో రెండో అతిపెద్ద విద్యా కేంద్రంగా హనుమకొండకు గుర్తింపు ఉంది. కేయూ, కేఎంసీ అభివృద్ధి చెందాయి. ఎంజీఎం, కలెక్టరేట్‌తో ప్రజలకు మరిన్ని సేవలు చేరువయ్యాయి.
ఉత్తర తెలంగాణ కేంద్రంగా అభివృద్ధి..
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన వరంగల్–హనుమకొండ జంట నగరాలు.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధికి చిరునామాగా మారాయి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, ఐటీ రంగాల్లో నమోదైన పురోగతి నగర రూపురేఖలను మార్చింది. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ 2014తో పోలిస్తే నేడు గ్రేటర్ వరంగల్–హనుమకొండ ప్రాంతం ఉత్తర తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా ఎదిగిందనడంలో సందేహం లేదు.
గ్రేటర్ వరంగల్–హనుమకొండలో ప్రగతి పరుగులు మహానగర రూపురేఖలు మార్చిన పుష్కర కాలం


