పోరు సల్పిన ఓరుగల్లు | - | Sakshi
Sakshi News home page

పోరు సల్పిన ఓరుగల్లు

Jun 2 2026 9:49 AM | Updated on Jun 2 2026 9:49 AM

పోరు సల్పిన ఓరుగల్లు

ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి బీజం పడింది ఇక్కడే. దశాబ్దాల కిందటి పోరాటానికి నాయకత్వం వహించిన ముఖ్యులూ ఇక్కడి వారే. ప్రత్యేక పోరులో అసువులుబాసిన ఎక్కువ మందీ ఈ నేల బిడ్డలే. ఉద్యమానికి ఊపిరి పోసి.. పోరు సల్పిన ఓరుగల్లుది తెలంగాణ అధ్యాయంలో కీలకభూమిక. నేడు (మంగళవారం) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12 ఏళ్ల తెలంగాణకు ఏర్పాటులో కీలకమైన కొన్ని ఘట్టాలు ‘సాక్షి’ ప్రత్యేకం.

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్‌–హనుమకొండ జంట నగరాలు కీలక పాత్ర పోషించాయి. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి 2014 రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన ప్రతీ ప్రధాన ఉద్యమ ఘట్టానికి కాకతీయుల గడ్డ కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉద్యమానికి ఊపిరిగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ప్రజా సంఘాలు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి.

ఉద్యమ ఘట్టాలు

● 1969: తొలి తెలంగాణ ఉద్యమంలో

విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు.

● 2001: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఉద్యమ కార్యక్రమాల విస్తరణ.

● 2009: కేసీఆర్‌ ఆమరణ దీక్షతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం. కాకతీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలు.

● 2009 డిసెంబర్‌ 9: తెలంగాణ ప్రకటనతో సంబురాలు.

● 2009 డిసెంబర్‌ 23: కేంద్రం వెనక్కి తగ్గడంతో ఆందోళనలు, నిరసనలు.

● 2010–11: విద్యార్థి జేఏసీలు, ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో కీలక పాత్ర.

● 2011: సకల జనుల సమ్మె.. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం స్తంభించడం.

● రైల్‌రోకో, రాస్తారోకో: జాతీయ రహదారులు, రైల్వే మార్గాల్లో భారీ నిరసనలు.

● ధూంధాం కార్యక్రమాలు: తెలంగాణ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంస్కృతిక ఉద్యమం.

● అమరవీరుల త్యాగాలు: ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు యువకులు, విద్యార్థుల బలిదానాలు ఉద్యమానికి బలాన్నిచ్చాయి.

● 2013: తెలంగాణ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీలు, సభలు.

● 2014 జూన్‌ 2: తెలంగాణ ఆవిర్భావంతో వరంగల్‌లో చారిత్రాత్మక సంబురాలు.

ఉద్యమానికి గుర్తులు..

కాకతీయ విశ్వవిద్యాలయం, హనుమకొండ చౌరస్తా, ఏకశిల పార్కు, కలెక్టరేట్‌ పరిసరాలు, అమరవీరుల స్తూపాలు

ప్రత్యేకత ఇదే..

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత అత్యధిక ఉద్యమ కార్యకలాపాలు జరిగిన కేంద్రంగా కేయూ గుర్తింపు పొందింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కళాకారులు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాయి.

ఉద్యోగుల కీలక పాత్ర

హన్మకొండ అర్బన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉద్యోగుల పాత్ర విశేషంగా నిలిచింది. రాష్ట్రస్థాయిలో ఏ పిలుపు వచ్చినా ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్‌గా పరిటాల సుబ్బారావు, ఉద్యోగ సంఘాల నాయకుడిగా కారం రవీందర్‌రెడ్డి తదితరులు ముందుండి నడిపించారు. కేసులు నమోదైనా, వేతనాలు నిలిపేసినా వెనక్కి తగ్గకుండా తెలంగాణ సాధన కోసం పోరాటాన్ని కొనసాగించారు. అప్పటి ఉద్యమ నేత కేసీఆర్‌, జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సహా రాష్ట్రస్థాయి నాయకులు వరంగల్‌లో నిర్వహించిన ఉద్యమ కార్యక్రమాలకు తరచూ హాజరయ్యేవారు.

తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ది కీలకభూమిక

స్వరాష్ట్ర పోరాటానికి

బీజం పడింది ఇక్కడే!

తెలంగాణ అమరవీరుల సేవలు

చిరస్మరణీయం

నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

సందర్భంగా ఉద్యమ ఘట్టాలు

‘సాక్షి’ ప్రత్యేకం..

Advertisement
 
Advertisement
Advertisement