హన్మకొండ అర్బన్: రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు హనుమకొండ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం జరిగే వేడుకలకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ప్రత్యేక ప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఖుష్‌మహల్ ప్రాంగణంలో..
ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ ప్రాంగణం సర్వం సిద్ధమైంది. సోమవారం డిప్యూటీ సిటీ పోలీస్ కమిషనర్ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డితో కలిసి కలెక్టర్ సత్యశారద ఏర్పాట్లను పరిశీలించారు. ఖుష్‌మహల్, రాతికోట ముఖద్వారం, చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అమరవీరుల స్తూపాన్ని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్‌దీపాలతో అలంకరించారు. కాగా, నేడు (మంగళవారం) ఉదయం 7 గంటలకు వేడుకలు ప్రారంభంకానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉదయం 7:45 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులు, 8 గంటలకు జెండా ఆవిష్కరణ, 8.15 గంటలకు పరేడ్, 8.25 గంటలకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరణ, 8.30 గంటలకు జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రి ప్రసంగం, 9.15 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.30 గంటలకు అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 9.40 గంటలకు స్టాళ్ల సందర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు.


