హన్మకొండ: మహోన్నత సేవా పతకానికి వరంగల్ టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బోనాల కిషన్ ఎంపికయ్యారు. 1995 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన వరంగల్ రేంజ్ పరిధిలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం కిషన్ డిప్యుటేషన్‌పై టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవులపల్లి రమేశ్, కానిస్టేబుల్ కాలేరు ఉపేందర్ ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. వారికి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అభినంధనలు తెలిపారు.
పలువురు పోలీసులకు పతకాలు
వరంగల్ క్రైం: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులను ప్రభుత్వం పతకాలకు ఎంపిక చేసింది. ముగ్గురు పోలీసు అధికారులకు ఉత్తమ సేవా పతకం, 19 మందిని సేవా పతకానికి ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అగ్నిమాపక అధికారికి
మహోన్నత సేవా పతకం
కాశిబుగ్గ: జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.యజ్ఞనారాయణ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు (మంగళవారం) ఈ సేవా పతకాన్ని అందజేయనున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పతకానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యజ్ఞనారాయణకు అగ్నిమాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


