కమలాపూర్ : ‘మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 32.5 క్వింటాళ్ల మక్కలు విక్రయించాను. 15 రోజులు దాటినా ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో నయాపైస జమ కాలేదు. అష్టకష్టాలను ఓర్చుకుని పంటు సాగు చేశాను. వాటిని అమ్ముకోవడానికి అరిగోస పడ్డాం. పెట్టుబడికి తీసుకొచ్చిన అప్పులు కట్టుకొందామనుకుంటే డబ్బులు ఇంకా చెల్లించడం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలి’ అని మండలంలోని గూనిపర్తికి చెందిన రైతు అచ్చె సుధాకర్‌తో పాటు కమలాపూర్ మండల వ్యాప్తంగా మొక్కజొన్న విక్రయించిన రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని, వెనువెంటనే డబ్బులు చెల్లిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మొక్కజొన్న డబ్బులు వెంటనే జమా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.5.66 కోట్ల బకాయిలు
కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏప్రిల్ 22న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టారు. అప్పటి నుంచి ఈనెల 20 వరకు మండల వ్యాప్తంగా 632 మంది రైతుల నుంచి 23,610 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మక్కలకు సంబంధించి రైతులకు రూ.5,66,64,000 డబ్బులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా డబ్బులు చెల్లించలేదు. దీంతో రైతులు డబ్బుల కోసం నిర్వాహకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా మరో వారం రోజుల్లో రైతులందరికి డబ్బులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు.
విక్రయించి రోజులు గడుస్తున్నా
ఖాతాల్లో జమకాని డబ్బులు
రూ.5.66 కోట్ల పెండింగ్
మండిపడుతున్న రైతులు
15 రోజులు అవుతుంది
ఈనెల 5వ తేదీన కమలాపూర్‌లో 27 క్వింటాళ్ల మక్కలు విక్రయించాను. 15 రోజులైనా డబ్బులు రాలేదు. బయట అప్పులిచ్చినోళ్లు ఇబ్బందులు పెడుతున్నారు. డబ్బుల కోసం రోజు బ్యాంకు, అధికారుల చుట్టు తిరుగున్నాను. డబ్బులు వెంటనే చెల్లించాలి.
– గొట్టె శ్రీనివాస్, కమలాపూర్
డబ్బులు వెంటనే చెల్లించాలి
47.50 క్వింటాళ్ల మక్కలు విక్రయించి 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. మరో 15 రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. వెంటనే మక్కల డబ్బులు చెల్లించాలి. ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించాలి.
– కొలిపాక కుమారస్వామి, వంగపల్లి


