గ్రేటర్‌లో విలువైన దస్త్రాలకు బూజు, చెదలు | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో విలువైన దస్త్రాలకు బూజు, చెదలు

Apr 29 2026 7:12 AM | Updated on Apr 29 2026 7:12 AM

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహానగర ప్రజలకు సంబంధించిన అత్యంత విలువైన భవనాల రికార్డులు గల్లంతయ్యాయి. బల్దియా సిబ్బంది సమన్వయ లోపంతో ఫైళ్లు మాయమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రికార్డు సెక్షన్‌ నిర్వహణపై భద్రత కరువై అధ్వానంగా తయారైంది. ఆస్తుల రుజువులు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ముక్కుపిండి ఆస్తిపన్నులు వసూలు చేసే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం అందుకు సంబంధించిన దస్త్రాలను జాగ్రత్తగా భద్రపర్చకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏం మతలబో ఏమో..

ప్రభుత్వ కార్యాలయమంటే సాధారణంగా సంవత్సరాల నాటి దస్త్రాలు ఎన్ని ఉన్నా సరే జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఉన్నతాధికారులైనా, పౌరులైనా సమాచారం కావాలంటే అందించేందుకు వీలుగా రికార్డు గదిలో భద్రపరుస్తుంటారు. కానీ, బల్దియా కార్యాలయంలో మాత్రం అందుకు భిన్నం. అక్కడ ఏ ఫైల్‌ ఎక్కడుందో అంతుచిక్కడం అంత సులువైన విషయం కాదు. కీలకమైన దస్త్రాం ఎక్కడుందో కనిపెట్టడానికి అష్టకష్టాలు పడాల్సిందే. బల్దియా ప్రధాన కార్యాలయంలో 1965 సంవత్సరం నుంచి భవనాలకు సంబంధించిన, ఆస్తుల అసెస్‌మెంట్లు, రికార్డులు, భవన నిర్మాణ అనుమతులు, ఇంజనీరింగ్‌ అభివృద్ధి పనులు, ఉద్యాన విభాగం, ప్రజారోగ్యం, సాధారణ పరిపాలన విభాగం తదితర విభాగాల రికార్డులు, దస్త్రాలను భద్రపర్చాలి. రికార్డు సెక్షన్‌లో రూ.వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన వివరాల ఆనవాళ్లు నిక్షిప్తంగా భద్రపర్చాల్సి ఉంటుంది. రికార్డు రూం నిర్వహణ సరిగా లేకపోవడంతో 1984, 1993 సంవత్సరాలకు చెందిన కొన్ని పైళ్లను మాత్రమే ‘ఆన్‌లైన్‌’ నమోదు చేసి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఆగమాగం..

అస్తవ్యస్తం

అత్యంత విలువైన రుజువుల పత్రాలు, పుస్తకాలు చెదల పాలవుతున్నాయి. ఆస్తులు, ఇతర కార్యకలపాలకు సంబంధించి పత్రాలు గల్లంతవుతున్నాయి. వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతుండడంతో ఫైళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రజల ఆస్తులకు సంబంధించిన రికార్డులు, పత్రాలను సరిగా భద్రపరచడం లేదు. దీంతో అవి నేలపాలవుతున్నా సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

తప్పించుకుంటున్న సిబ్బంది..

ప్రజలకు తప్పని తిప్పలు

బల్దియాకు చెందిన కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్‌ కార్యాలయాల్లోని పైళ్లను ప్రధాన కార్యాలయంలోని రికార్డుల గదికి అప్పగించడం లేదు. రెండేళ్ల క్రితం ఎంబీ రికార్డులు మాయం కావడంతో పలువురు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినప్పటికీ బల్దియా సిబ్బందిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఏళ్ల తరబడి ఉన్న భవనాల స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం కావాలంటే అసెస్‌మెంట్‌ కాపీని సమర్పించాలి. ఆ రికార్డులు బల్దియాలో అందుబాటులో లేవు. ఎవరికి వారు యమునాతీరే అన్న చందంగా ఆయా సెక్షన్లలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దస్త్రాలు కావాలంటే ఒకరిపై ఒకరు నెపం మోపుతూ తప్పించుకుంటున్నారు. దీంతో వివిధ రుజువుల కోసం వస్తున్న ప్రజలు వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ఏ ఫైల్‌ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ రూపొందించిన ఫైల్‌ ట్రాకింగ్‌ విధానం అమలు కొంత మేరకు చేపట్టారు. ఏమైందో తెలియదు కానీ ఆన్‌లైన్‌లో భద్రపర్చే సంస్థకు బల్దియా సొమ్ము చెల్లించకపోవడంతో సిబ్బంది పెట్టెబేడ సర్దుకొని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆస్తులు, ఫైళ్లు, రికార్డులకు సంబంధించిన పాత కాలపు రుజువుల ఆచూకీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై బల్దియా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్‌ను వివరణ కోరితే గతంలో జరిగిన విషయాలు తనకు తెలియదని దాటవేశారు.

ఆస్తుల ఆనవాళ్లు లేక ప్రజల ఇబ్బందులు

పట్టించుకోని పాలక, అధికార వర్గాలు

Advertisement
 
Advertisement
Advertisement