విద్యారణ్యపురి: వచ్చే విద్యాసంవత్సరం (2026–2027) నుంచి హనుమకొండ జిల్లాలో నాలుగు, వరంగల్ జిల్లాలో రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటుకానున్నాయి. నియోజకవర్గానికి ఒక స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుతినిచ్చింది. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ, జిల్లాపరిషత్ స్కూళ్లలోనే ఈ స్కూల్స్ ఏర్పాటుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎక్కడెక్కడంటే..
హనుమకొండ జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోని వరంగల్ పశ్చిమలోని కాజీపేట ప్రభుత్వహైస్కూల్ (బాయ్స్), ఽస్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం నారాయయణగిరి జెడ్పీహెచ్‌ఎస్, వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్‌పర్తి ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్, పరకాలలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల జెడ్పీహెచ్‌ఎస్‌లను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట ప్రభుత్వ హై స్కూల్, తూర్పు నియోజకవర్గంలో శుంభునిపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటుచేయనున్నారు. కో ఎడ్యుకేషన్‌గానే ఈ పబ్లిక్ స్కూల్స్ ఉండనున్నాయి.
ఒక్కో స్కూల్ కోసం రూ.15 కోట్లు
ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేయనుందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత హైస్కూల్‌లో ఇప్పటివరకు ఉన్న తరగతి గదులతోపాటు అదనపు గదులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ ల్యాబ్‌లు, అటల్ టింకరింగ్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఒకేషనల్ ల్యాబ్స్, లైబ్రరీ, మోడర్న్ కిచెన్, డైనింగ్‌హాల్ ఉంటుంది. క్రీడలకు మైదానం, మ్యూజిక్, డ్యాన్స్ నేర్పించేందుకు కూడా విశాలమైన గదులను నిర్మించనున్నారు. తరగతి గదులే కాకుండానే మిగతా ల్యాబ్స్ తోపాటు యాక్టివిటీస్ కోసం అదనంగా 25 గదులను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో పాఠశాలలో మొత్తంగా 56 తరగతి గదులుంటాయి. విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన, వివిధ క్రీడలు, కళల్లో ఆసక్తి పెంచుకునేలా శిక్షణ ఉంటుంది. డిజిటల్ విద్య అందిస్తారు. ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు ఇచ్చే నిధులతో ఆయా స్కూల్ డెవలప్‌మెంట్ (పేరెంట్స్‌తో కూడిన) కమిటీనే నిర్మాణాలు చేపట్టాల్సింటుంది. ఈ కమిటీలో హెడ్‌మాస్టర్ కన్వీనర్‌గా, ఇంజనీర్, 24 మంది తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. ప్రీ ప్రైమరీలో 20 మంది, ప్రైమరీలో ఒక్కో తరగతికి 30 మంది, హైస్కూల్‌లో ఒక్కో తరగతికి 40 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
మోడల్ కోసం రంగారెడ్డి జిల్లా
ఆరుట్ల పబ్లిక్ స్కూల్ సందర్శన..
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం హనుమకొండ నుంచి పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి, డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్, ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేష్, ఎంఈఓలు డాక్టర్ బి.రాంధన్, ఎ.శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లాలోని అరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ మోడల్ స్కూల్‌లో గత విద్యాసంవత్సరంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అభివృద్ధి చేశారు. సుమారు 2వేల మంది విద్యార్థులు చదువుతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.. ఆర్‌జేడీ, డీఈఓలతో సమావేశం నిర్వహించి స్కూల్ ఏర్పాటు, విధివిధానాలు వివరించడంతోపాటు అక్కడి వసతులను ప్రత్యక్షంగా చూపించారు. 15 రోజుల్లోనే ఈ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని మురళి వెల్లడించారని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.
ఏర్పాటుకానున్న
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు
ప్రీప్రైమరీ నుంచి
ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే
సెమీ రెసిడెన్షియల్‌గా
విద్యతోపాటు క్రీడలు, కళలు
ఒక్కో స్కూల్‌కు రూ.15కోట్ల వరకు నిధులు


