హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించమని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ) నాయకులు హెచ్చరించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఘటనను సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని సూచించారు. ఉద్యోగులను బెదిరించే చర్యలను ఉపేక్షించమని స్పష్టం చేశారు. హనుమకొండ టీజీఓ అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ తదితరులు ఈ ఘటనను ఖండిస్తూ నిరసన తెలిపారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారులు, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండ డిపో నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, హనుమకొండ, ఖిలా వరంగల్, వరంగల్, హసన్‌పర్తి, కమలాపూర్, పర్వతగిరి, సంగెం మండలాల ప్రజలు, ప్రయాణికులు 8977781103 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించి, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
హన్మకొండ అర్బన్ : జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో పెట్రోలు, డీజిల్ సరఫరాపై పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పెట్రోలియం సంస్థల వద్ద ఉన్న ఇంధన నిల్వల వివరాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంధన కొరత లేనప్పటికీ బంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయని, ఇది అసత్య ప్రచారం వల్లేనని తెలిపారు. పెట్రోల్ బంకులు వాహనదారులకు ప్రాధాన్యత ఇచ్చి ఇంధనం సరఫరా చేయాలని, బాటిళ్లు, క్యాన్లలో తీసుకెళ్లడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇంధన కొరత అపోహలను తొలగించేందుకు పెట్రోలియం సంస్థలు ప్రజ లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎండీ వాజీద్ అలీ, జిల్లా రవాణాశాఖ అధికారి వేణుగోపాల్, డీడబ్ల్యూఓ విశ్వజ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ప్రేమకళ, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


