న్యూశాయంపేట: నీట్ (యూజీ–2026) పరీక్ష నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు, దివ్యాంగులకు 6 గంటల వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలో వసతులు కల్పించాలన్నారు. సీకేఎం ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారి భిక్షపతి పాల్గొన్నారు.
పెట్రోల్ కొరత లేదు..
జిల్లాలో పెట్రోల్ కొరత లేదని కలెక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి పెట్రోల్ బంక్ యాజమాన్యాలతో మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. పుకార్లు నమ్మవద్దని, ప్రజలు ఆందోళనలకు గురికావొద్దని సరఫరా సాధారణంగా కొనసాగుతుందన్నారు.
విమానాశ్రయాన్ని సందర్శించిన కలెక్టర్
ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయాన్ని కలెక్టర్ సత్యశారద ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. రన్‌వే, రన్ వే విస్తీర్ణం కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని పరిశీలించారు. అంతకుముందు ఎయిర్‌పోర్ట్ అధికారులతో చర్చించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎయిర్‌పోర్టు అథారిటీ ఈడీ ఎస్‌కే గుప్తా, జై గౌరవ్ చౌదరి, జేజీఎం బాలేందర్‌కుమార్ తివారి, డీజీఎం ఉమేశ్‌కుమార్ తివారి, ఏజీఎం గోపాలకృష్ణ, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.


