నేర సమీక్షలో పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: డ్రగ్స్‌కు బానిసగా మారకుండా యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారి నేరసమీక్ష మంగళవారం జరిగింది. కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ కోసం సంబంధిత అధికారులు తీసుకుంటున్న చర్యలను ఎస్‌హెచ్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పురోగతిపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ మత్తుపదార్థాల నియంత్రణలో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని విద్యాసంస్థలు, గ్రామాల ప్రధాన కూడళ్లల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మూగజీవాల అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత సమయంలో షాపులు మూసివేసేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమయపాలన పాటించని నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో వారిని డీసీపీస్థాయి అధికారుల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై తప్పడు ప్రచారం కారణంగా బంక్‌లకు తరలివస్తున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి శాంతి భద్రత సమస్యలు రాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల నియంత్రణ, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారుకావడంలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి నగదు, ప్రశంసపత్రాలు అందించారు. డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత, ట్రెయినీ ఐీపీఎస్ మనీషా, నేహ్రా, అదనపు డీసీపీలు రవి, బాలస్వామి, సురేశ్‌కుమార్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


