అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రవి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ, హౌసింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 162 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ట్రెయినీ ఐఏఎస్ సాయి శివాని, డీఆర్‌ఓ సత్యపాల్‌రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్, నారాయణ, డీఆర్డీఓ శ్రీను పాల్గొన్నారు.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి:
వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ లో కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 153 దరఖాస్తులు వచ్చాయి. కాగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలకు ఐదేళ్ల క్రితం వరంగల్ రంగశాయిపేట నాయుడుపంపు జంక్షన్‌లో ఉన్న తన సొంతభవనాన్ని అధికారులు అద్దెకు తీసుకున్నారని, అద్దె ఇవ్వడం లేదని, ఖాళీ చేసి బకాయి డబ్బులిప్పించాలని య జమాని కొల్లూరి యోగానంద్ వినతి అందించారు.


