ఆస్పత్రిలో కరువైన నిఘా..
జనగామ: జనగామ జిల్లాకేంద్రం శివారులోని చంపక్ హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి (ఎంసీహెచ్)లో ఎనిమిది రోజుల పసికందును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. ఆస్పత్రి సిబ్బంది, పసికందు కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ మహిళను వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్‌పూర్ గ్రామానికి చెందిన చామంతుల కరుణాకర్, కీర్తన దంపతులు ఈ నెల 2వ తేదీన డెలివరీ కోసం జనగామ ఎంసీహెచ్‌కు వచ్చారు. అదేరోజు కీర్తన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు (బాబు)కు జాండీస్ ఉండడంతో ఎస్‌ఎన్‌సీయూ (నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం)లో బాక్స్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జనరల్ వార్డులో ఉన్న కీర్తన(బాలింత)కు సమీపంలో బుధవారం రఘునాథపల్లి మండలానికి చెందిన జ్యోతి అనే మహిళ ఆమె బెడ్డు పక్కనే రెండు, మూడు గంటలుగా ఉండటంతో సిబ్బందికి పెద్దగా అనుమానం కలగలేదు. రాత్రి 7 గంటల సమయంలో ఎస్‌ఎన్‌సీయూ నుంచి శిశువు(బాబు) ఏడుస్తున్నాడన్న సమాచారం వచ్చింది. అక్కడే ఉన్న జ్యోతి.. బాలింత కీర్తన బంధువులా నటిస్తూ ఎస్‌ఎన్‌సీయూ వార్డు లోపలికి వెళ్లింది. సెక్యూరిటీని ఏమారుస్తూ బాక్స్‌లో ఉన్న పసికందును తీసి టవల్లో చుట్టుకుని ఎవరి కంటబడకుండా ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేసింది. ఓ ఆటోలో ప్రయాణికురాలిగా ఎక్కి జనగామకు వెళ్లాలని చెప్పి బయలుదేరింది. ఆ తర్వాత తల్లి కీర్తన వార్డుకు వచ్చి చూడగా బాక్స్‌లో శిశువు లేకపోవండతో ఆందోళనకు గురైంది. వెంటనే సెక్యూరిటీ గార్డ్ రాజు, పసికందు తండ్రి కరుణాకర్, సూపర్‌వైజర్ అమృత్, గార్డులు ఉప్పలయ్య, భాస్కర్, మరో పేషెంట్ భర్త వడ్డేపల్లి రాజు తక్షణం స్పందించి బైకులపై ఆటోను వెంబడించారు. శామీర్‌పేట శివారులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆటోను ఆపి జ్యోతిని ప్రశ్నించారు. ‘ఆమె నా బిడ్డ..’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేయగా, గట్టిగా అడగడంతో నిజం బయటపడింది. జ్యోతితో పాటు పసికందును అదే ఆటోలో ఎంసీహెచ్‌కు తిరిగి తీసుకువచ్చారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న బంధువులు .. జ్యోతిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్ హుటాహుటినా అక్కడికి చేరుకొని జ్యోతిని విచారించారు. మహిళా కానిస్టేబుళ్ల ఆధ్వర్యంలో జ్యోతిని ఆస్పత్రి వెనుక ద్వారం గుండా బయటకు తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
పసికందు అపహరణ ప్రయత్నానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం, ఒత్తిళ్లు వంటి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. తమ బాబును ఎత్తుకెళ్లారనే తీవ్ర మనోవేదనతో బంధువుల దాడి సమయంలో సెక్యూరిటీ గార్డు రాజు తలకు గాయం కాగా, చికిత్స అందించారు. బాబును ఎత్తుకెళ్లిన మహిళను కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనగామ ఎంసీహెచ్‌లో ఘటన
ఆటోలో పరారైన మహిళను
వెంబడించి పట్టుకున్న బంధువులు
సదరు మహిళపై దాడి..
ఆస్పత్రి ఎదుట ఆందోళన
పోలీస్ స్టేషన్‌కు మహిళ తరలింపు..
విచారణ
ఎంసీహెచ్‌లో పసికందు అపహరణ ఘటనతో భద్రతా లోపాలు బహిర్గతమయ్యాయి. పసికందు బంధువులుగా నటించిన మహిళను ఎవరూ ప్రశ్నించకపోవడం, పసికందు చేతికి ఉన్న ట్యాగ్ తీసివేసినా గమనించకపోవడం గమనార్హం. ఎస్‌ఎన్‌సీయూ లోపలికి ఎవరు వచ్చినా తగిన తనిఖీలు లేకపోవడం ఆ స్పత్రి వర్గాల నిఘా లోపంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీటీవీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ, ఎస్‌ఎన్‌సీయూ నుంచి పసికందును ఎత్తుకు వెళ్తుంటే కనీసం గుర్తుకు పట్టకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.


