● ఎంజీఎంలో చికిత్స.. ఆస్పత్రిలోనే పినతల్లిపై కేసు నమోదు
కాజీపేట : ఓ మూగ బాలికను పిన తల్లి చితకబాదింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు బాలిక ఎంజీఎం చికిత్స పొందుతోంది. బాధితురాలి అమ్మమ్మ ఎండీ సుల్తానా కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట 47వ డివిజన్ డీజిల్ కాలనీ ప్రాంతానికి చెందిన ఎండీ అబుబక్కర్ మొదటి భార్య మృతి చెందింది. ఈ దంపతులకు ఎస్‌కే పాషా సిద్దికా (13 సంవత్సరాల వయసు)సంతానం. సిద్దికా పుట్టు మూగ. దీంతో మంచి చెడులను అమ్మమ్మ వాళ్లు చూసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల అబుబక్కర్.. రజియా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమ్మమ్మ ఇంటి నుంచి పండుగకు వచ్చిన సిద్దికాను మంగళవారం పినతల్లి చితకబాదడంతోపాటు శరీరంపై కాల్చింది. దీంతో తీవ్రంగా గాయపడి తల్లాడిల్లుతున్న బాలికను చూసి చలించిన అమ్మమ్మ వెంటనే ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సుల్తానా ఫిర్యాదు మేరకు ఎస్సై శివ బుధవారం ఎంజీఎం వెళ్లి వైద్యులతో చర్చించి పినతల్లి రజియాపై కేసు నమోదు చేశారు. కాగా, చైల్డ్‌వేల్ఫేర్ అధికారులు చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి వివరాలు సేకరించారు.
గంజాయి, గంజాయి చాక్లెట్ల పట్టివేత
● ఏడుగురిపై కేసు నమోదు
కాజీపేట : కాశీ నుంచి గంజాయి, గంజాయి చాక్లెట్లతో రైలులో కాజీపేటకు వచ్చిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి కాజీపేట పీఎస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్‌కు చెందిన కందగట్ల రాజేశ్ (ఆటో డ్రైవర్, కరీమాబాద్), ముద్దెన శివకుమార్ (మేసీ్త్ర, కరీమాబాద్), దేవులపల్లి నిఖిల్ (కరీమాబాద్), పిట్టల పవన్(కూలీ), రౌతు రవితేజ (ఫ్లైవుడ్ షాపు), కందగట్ల రవీందర్ (ఆటో డ్రైవర్), సయ్యద్ ఖాజాపాషా (ఏసీ మెకానిక్)లు మిత్రులు. వీరు కాశీ నుంచి గంజాయి, గంజాయి చాక్లెట్లతో కాజీపేటలో రైలు దిగి వెళ్తుండగా పెట్రోలింగ్‌లో ఉన్న ఎస్సై లవన్‌కుమార్ పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 30 గ్రాముల శుద్ధి చేసిన గంజాయి, 830 గ్రాముల చాక్లెట్లు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


