● వరంగల్ ఎంపీ కడియం కావ్య,
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధిస్తామని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వేయిస్తంభాల ఆలయాభివృద్ధికి, కల్యాణ మండపం పునరుద్ధరణ పనులకు కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) ద్వారా రూ.14.44 కోట్ల్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆలయాన్ని ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం ఉపేంద్రశర్మ ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం అందించారు. మంజూరైన నిధులు ఏ పనులకు వినియోగిస్తారనే విషయాలను కేంద్రపురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో సమావేశంలో ఎంపీ కావ్య మాట్లాడుతూ.. గతేడాది ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను, కేంద్ర పురావస్తుశాఖ అధికారులను కలిసి వేయిస్తంభాల ఆలయానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా ఐదుసార్లు మెమోరాండం సమర్పించామని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిధుల మంజూరు ఎంపీ నాయ కత్వంలో ఎమ్మెల్యేలంతా సాధించిన విజయమ న్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు కుమార్‌యాదవ్, నూర్జహాన్, తదితరులు పాల్గొన్నారు.
నాయీ బ్రాహ్మణ పొదుపు
సంఘం వార్షిక సమావేశం
హన్మకొండ: నాయీ బ్రాహ్మణ పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం 9వ వార్షిక సమావేశం మంగళవారం హనుమకొండలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవంలో నాయీ బ్రాహ్మణ సంఘం తరఫున ఈ నెల 21న జరిపే పూజా కార్యక్రమాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగవెల్లి సురేష్ కుమార్, అర్చకులు భద్రకాళి శేషు, కార్పొరేటర్ వెంకన్న, జగదీష్ బాబు, తూముల సాంబయ్య, జీవనాథం, రమేష్, నరేందర్ పాల్గొన్నారు.


