లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Apr 5 2026 7:30 AM | Updated on Apr 5 2026 7:30 AM

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు చర్చలతోనే సమస్యల పరిష్కారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో టెండర్లకు ఆహ్వానం తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్ట విరుద్ధ చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. దీని కోసం కమిషనరేట్‌ పరిధిలో కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం ద్వారా ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ కమిషనరేట్‌ పరిధి అన్ని అల్టాసౌండ్‌ స్కానింగ్‌ సెంటర్లు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌తోనే పనిచేయాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినట్లు గమనిస్తే పోలీస్‌ స్టేషన్‌ లేదా డయల్‌ 100, ఎస్‌.బీ 87126 85257 కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆడపిల్లల సంరక్షణ, లింగ సమానత్వం కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు.

హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్‌

జడ్జి జి.ఎల్‌.శ్రీదేవి

హన్మకొండ: సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని హనుమకొండ జిల్లా ఎఫ్‌ఏసీ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ జి.ఎల్‌.శ్రీదేవి అన్నారు. హనుమకొండ సర్క్యూట్‌ హౌస్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఆదరణ ఆల్‌ కమ్యూనిటీ మీడియేషన్‌ సెంటర్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మీడియేషన్‌ సెంటర్‌కు జిల్లా కోర్టు ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వివిధ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న వివాదాలు, తగాదాలను ఉచితంగా న్యాయబద్ధంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి జి.రామలింగం, సుబేదారి ఎస్సై టి.సుమన్‌ పాల్గొన్నారు.

కాశిబుగ్గ: వరంగల్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లు, డ్యూటీ డాక్టర్ల ఆహారం సరఫరా కోసం ఈ–టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కాంతి ప్రకాశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్‌ దరఖాస్తులను ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు సమర్పించవచ్చని సూచించారు. అదేవిధంగా ఈఎస్‌ఐ ఆస్పత్రి వరంగల్‌ నుంచి వివిధ డిస్పెన్సరీలకు మందులు, వైద్య వినియోగ వస్తువుల రవాణాకు అద్దె వాహనానికి ఈ–టెండర్‌ ప్రకటిస్తున్నట్లు, ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.

కాశిబుగ్గ: వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం లీగల్‌ మెట్రాలజీ అధికారి కె.మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల తూకాన్ని తిరిగి తూకం వేసి పరిశీలించారు. తూకం యంత్రాలను సరిచూసి, ముద్ర వేయించుకోకుండా వినియోగంలో ఉంచిన రెండింటిపై కేసులు నమోదు చేశారు. కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్న నూనె ప్యాకెట్ల తూకాలను పరిశీలించారు. అదేవిధంగా కొలతలకు సంబంధించిన నిబంధనలు పాటించని ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారి మనోహర్‌ తెలిపారు.

అమ్మవారి సన్నిధిలో కాలనాగ మహర్షి గురూజీ

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయాన్ని శనివారం కాలనాగ మహర్షి గురూజీ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ పరిశీలకులు క్రాంతికుమార్‌, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వరరావు ఆయనను స్వాగతించారు. గురూజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement