భూసేకరణ త్వరగా పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ త్వరగా పూర్తి చేయండి

Apr 5 2026 7:30 AM | Updated on Apr 5 2026 7:30 AM

భూసేకరణ త్వరగా పూర్తి చేయండి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో భూసేకరణ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ ద్వారా సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గౌరవెల్లి, జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సాదాబైనామా సమస్యలు, మీసేవ సర్టిఫికెట్ల జారీపై తీసుకోవాల్సిన చర్యలను అదనపు కలెక్టర్‌ రవి, ఆర్డీఓలు, జాతీయ రహదారుల శాఖ, రహదారులు, భవనాల శాఖ అధికారులు, తహసీల్దార్లతో కలిసి సమీక్షించారు. సమావేశంలో ఆర్డీఓలు రమేశ్‌, డాక్టర్‌ కన్నం నారాయణ, జాతీయ రహదారులు, రహదారులు–భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

విజయవంతంగా నిర్వహించాలి..

ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్‌ 6 నుంచి 11 వరకు జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పాయ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తేదీల వారీగా కార్యాచరణను వివరించారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ వేగవంతానికి చర్యలు

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసి సమయానికి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సుమారు 65 శాతం పూర్తయ్యిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓలు రాథోడ్‌ రమేశ్‌, డాక్టర్‌ కన్నం నారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌ సింగ్‌, తహసీల్దార్లు రవీందర్‌రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన కలెక్టర్‌

హన్మకొండ: ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ శనివారం కలిశారు. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌లో జరిగిన సమీక్షకు వచ్చిన నవీన్‌ మిట్టల్‌కు ఆమె మొక్క అందించారు.

వడ్డేపల్లి బండ్‌ సమస్యల పరిష్కారానికి కృషి

కాజీపేట రూరల్‌: కాజీపేట వడ్డేపల్లి ట్యాంక్‌బండ్‌ సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. వడ్డేపల్లి ట్యాంక్‌ బండ్‌పై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం కమిషనర్‌ సందర్శించారు. ఈసందర్భంగా కమిషనర్‌ సంబంధిత అధికారులతో కలిసి కలియదిరిగారు. వాకర్స్‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేశ్‌, జనరల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, సీనాసాగర్‌, మాజీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కై లాస్‌నంద్‌ అగర్వాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, కోండ్ర శంకర్‌, వాకర్స్‌, అధికారులు పాల్గొన్నారు.

పూడికతీత పనుల్లో వేగం పెంచండి

నయీంనగర్‌: భద్రకాళి చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్‌, కుడా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌ భద్రకాళీ చెరువులో పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు చేశారు. మే 15 లోగా పూడికతీత పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్‌ రెడ్డి, ఈఈ భీమ్‌ రావు, ఇరిగేషన్‌ ఈఈ కిరణ్‌ కుమార్‌, డీఈ మధుసూదన్‌, ఏఈ శ్యామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement